logo

ఉపాధ్యాయులకే పరీక్ష

చిత్తూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 55మంది విద్యార్థులకు తరగతుల వారీగా బ్లాక్‌ బోర్డుపై ఉపాధ్యాయుడు ప్రశ్నలు రాశారు. వాటిని రాసుకుని ఆపై సమాధానాలు రాశారు.

Published : 04 Dec 2022 03:48 IST

 బొమ్మలు గీసేందుకే అధిక సమయం

ప్రశ్నపత్రాల జిరాక్స్‌కు పరుగులు

చిత్తూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బ్లాక్‌బోర్డుపై ఉన్న పరీక్ష ప్రశ్నలు రాసుకుంటున్న విద్యార్థులు

చిత్తూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 55మంది విద్యార్థులకు తరగతుల వారీగా బ్లాక్‌ బోర్డుపై ఉపాధ్యాయుడు ప్రశ్నలు రాశారు. వాటిని రాసుకుని ఆపై సమాధానాలు రాశారు. ఒకటో  తరగతి విద్యార్థులకు శనివారం నిర్వహించిన ఇంగ్లిషు పరీక్షలో బొమ్మల పక్కనఉన్న సరైన పదాన్ని జత పరచాలి. రెండో పేజీలో ఇచ్చిన బొమ్మలకు రంగులు దిద్దాల్సి ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఇప్పటివరకు ప్రశ్నపత్రం చేతికిస్తే వాటిని చూసి విద్యార్థులు సమాధానాలు రాసేవారు. ఇప్పుడు ప్రశ్నలు బోర్డుపై రాస్తే పిల్లలు చూసి రాసుకుని పరీక్ష రాయాలి. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఏఫ్‌ఏ-2 పరీక్షల విధానం ఉపాధ్యాయులకే పరీక్ష పెడుతోంది. కొన్ని సబ్జెక్టుల్లో బొమ్మలు బోర్డుపై గీయడం టీచర్లకు తలనొప్పిగా మారింది. రెండో తరగతి ప్రశ్నపత్రంలో టెన్నిస్‌, క్రికెట్, గేమ్స్‌, స్పోర్ట్స్‌ పదాలు పైన ఇచ్చి కింద గజిబిజిగా.. ఏబీసీడీలు గడులుగా రాసి అందులో పైపదాలు కలపాలి. ఇలా ప్రశ్నపత్రాలు రూపొందించగా వాటిని బోర్డుపై ఉపాధ్యాయుడు రాసిన తర్వాత విద్యార్థులు రాసుకుని సమాధానాలు రాయాలి.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా..?

ఈ పరీక్షలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా నిర్వహించాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలోని 1,904 ప్రాథమిక పాఠశాలల్లో.. 953 చోట్ల ఏకోపాధ్యాయులే. ఈ సారి ప్రశ్నపత్రం గంట ముందు ప్రధానోపాధ్యాయులకు వాట్సప్‌నకు రాగానే డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తే విద్యార్థులు వాటిని రాసుకుని ఆపై సమాధానాలు రాస్తున్నారు. విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు సొంత నగదుతో ప్రశ్నపత్రాన్ని జిరాక్స్‌ చేసుకుని పిల్లలకు ఇస్తున్నారు. 20 మంది కన్నా తక్కువగా ఉన్న పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇద్దరు ఉండాలి. ఆయా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఏకోపాధ్యాయుడే ఉన్నారు. ఇప్పుడు సర్దుబాటు పేరుతో అవసరమైన పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయిస్తారో లేదో వేచిచూడాలి.
పూతలపట్టు మండలం దొమ్మాండపల్లె ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులకు ఉన్న ఏకోపాధ్యాయుడు శనివారం సెలవు పెట్టడంతో మరొకరు వచ్చారు. ఆయన రెండు కిమీ దూరంలో ఉన్న పి.కొత్తకోటకు వెళ్లి ప్రశ్నపత్రాలు సొంత నగదుతో జిరాక్స్‌ తీసుకుని వచ్చి పరీక్ష నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని