logo

పక్క సర్వే సంఖ్యతో కాల్వనే రాసిచ్చాడు..?

కబ్జాలతో హద్దులను మార్చేశాడు ఆ భూబకాసురుడు... రెవెన్యూ అధికారుల సాయంతో ఏకంగా కాల్వనే ఆక్రమించేశాడు.

Updated : 04 Dec 2022 04:56 IST

రెవెన్యూ అధికారి బంధుప్రీతి

కాల్వకు అడ్డుగా నిర్మించిన గోడ

రేణిగుంట, న్యూస్‌టుడే: కబ్జాలతో హద్దులను మార్చేశాడు ఆ భూబకాసురుడు... రెవెన్యూ అధికారుల సాయంతో ఏకంగా కాల్వనే ఆక్రమించేశాడు. ఒక రెవెన్యూ అధికారి బంధుప్రీతి చూపించి పక్క సఖ్య వేసి కాల్వకే పట్టా చేసేర్వే సంశారు. ఈ అక్రమంపై అధికార పార్టీలోని నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రేణిగుంట మండలంలో ఒకప్పుడు రూ.లక్షల్లో పలుకుతున్న భూమి ధర ప్రస్తుతం రూ.కోట్లకు చేరింది. అత్యంత విలువైన రేణిగుంట పంచాయతీలోని వివేకానందకాలనీ సమీపంలోని భూములపై కొందరి కళ్లుపడ్డాయి. తూకివాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 831లో 14.28 ఎకరాలు వాగు పోరంబోకు, సర్వే నంబర్‌ 832లో 4.46 ఎకరాల వాగు ఉంది. గతంలో నీరు పారుతున్న ఈ వాగును జేసీబీతో రేణిగుంట పంచాయతీకి చెందిన ఒక వార్డు సభ్యురాలి బంధువు, అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు పూడ్చారు. అక్కడికి నీరు రాకుండా ఏకంగా మధ్యలో ఓ గోడ నిర్మించారు. ఇదే క్రమంలో వీటి పక్కనే ఉన్న సర్వే నంబర్‌ 830లో 38 సెంట్లు వాగు పోరంబోకు ఉండేది. ఇదంతా కొన్నాళ్ల కిందట రికార్డుల పరంగా ఇలానే ఉన్నప్పటికి ఇప్పుడు మారిపోయాయి. ఓ రెవెన్యూ అధికారి భార్యకు రేణిగుంటలో బంధువులు ఉండటం, ఆ బంధుప్రీతితో ఇక్కడ ప్రభుత్వ స్థలాలను అతనికి ఇచ్చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలాన్ని పూర్తిగా చదును చేసేశాడు. మరో సర్వే నంబర్‌తో ఉన్న పత్రాలను చూపుతూ ఇక్కడ కబ్జా చేస్తున్నాడు. ఇదంతా రెవెన్యూ అధికారులు కనుసన్నుల్లో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది

ఇలా చేసేశారు..

వాగు పక్కనే ఉన్న సర్వే నంబర్‌తో ఇదే ఆ భూమి అన్నట్లు బై నెంబర్లు వేసి రికార్డులు సృష్టించారు. అందుకు అనూకులంగా పక్కనే ఉన్న నెంబర్‌తో కొంత భూమి కొన్నట్లు పత్రాలు సృష్టించారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత ముందుగా ఇక్కడ ఉన్న వాగు పక్కనే ఉన్న ముళ్లపొదలను, పిచ్చిమొక్కలను తొలగించే పని చేపట్టాడు. అప్పటికి ఎవరు రాకపోవడంతో జేసీబీ సాయంతో వాగు మొత్తం చాలా వరకు చదును చేసేశాడు. అనంతరం ప్రహరీ నిర్మించారు. దానిపై ఫోన్‌ నెంబర్లు కూడా రాయించాడు. సర్వే నెంబర్‌ 830లో కేవలం 38 సెంట్లు ఉండగా దీనిని విభజించారు. 830/1ఏ, 830/1బీ, 830/1సీ, 830/2 అనే సృష్టించారని, ఇందులో మొత్తం సుమారు 2.09 ఎకరాలు భూమి ఉందని సృష్టించి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించేశారని స్థానికులు వాపోయారు. ఎవరైనా తనను ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతానని హెచ్చరించారని స్థానికులు వాపోయారు. జ్ఞదీనిపై తహసీల్దార్‌ శివప్రసాద్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని,   విచారించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని