logo

కూలి అందక.. ఆకలి కేక

ఉపాధి హామీ కూలీలది రెక్కాడినా డొక్కాడని దయనీయ పరిస్థితి. రెండున్నర నెలలుగా పని చేసిన వారు కూలీ డబ్బులు అందక, కుటుంబం గడవక అవస్థలు పడుతున్నారు.

Published : 07 Dec 2022 01:32 IST

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రూ.75 కోట్ల బకాయిలు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), సూళ్లూరుపేట, న్యూస్‌టుడే : ఉపాధి హామీ కూలీలది రెక్కాడినా డొక్కాడని దయనీయ పరిస్థితి. రెండున్నర నెలలుగా పని చేసిన వారు కూలీ డబ్బులు అందక, కుటుంబం గడవక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.75 కోట్ల మేర వారికి చెల్లింపులు ఆగిపోయాయి. జాతీయ ఉపాధిహామీ పథకం (నరేగా) కింద ఈఏడాది సెప్టెంబరు 19వ తేదీ నుంచి కూలీలు వేతనాల అందలేదు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో రోజుకు సగటున 45 వేల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 31.95 లక్షల పనిదినాలకు గాను, రూ.75 కోట్ల కూలీ డబ్బులు రావాల్సి ఉంది. నెలల తరబడి కూలి డబ్బులు అందకపోవడంతో అనేక మంది ఉపాధి పనుల పట్ల అనాసక్తిని చూపుతున్నారు. రోజు రోజుకీ కూలీల సంఖ్య తగ్గిపోవడంతో, లక్ష్యాలను అధిగమించలేక, నిర్దేశించిన పనులు చేయించలేక ఇబ్బంది పడుతున్నట్లు ఉపాధిహామీ క్షేత్ర స్థాయి సిబ్బంది వాపోతున్నారు.

బంగారుపాళ్యం మండలం టేకుమందకు చెందిన సుబ్రహ్మణ్యం ఉపాధి కూలీ. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు నెలాఖరు వరకూ ఉపాధి పనులు చేశాడు. మొత్తం 36 రోజులకు గాను సగటున రోజుకు రూ.220 లెక్కించినా రూ.7920 రావాలి. సకాలంలో కూలి డబ్బులు రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టమై భవన నిర్మాణ పనులకు వెళ్తున్నట్లు వాపోయాడు.

గంగాధరనెల్లూరు మండలం అగరమంగళంకు చెందిన రైతు మునెయ్య మామిడి చెట్లకు ఉపాధిహామీ పథకం కింద, ఉపాధి కూలీలతో ట్రెంచ్‌లు తవ్వించాడు. ఎంతకూ కూలీలకు డబ్బులు రాకపోవడంతో వారు ఒత్తిడి చేయడంతో కూలీలకు తానే స్వయంగా డబ్బులు చెల్లించానని, ఇలా ఆలస్యమవుతుందని తెలిస్తే అసలు పనులు చేయించేవాడిని కాదని ఆవేధన వ్యక్తం చేశాడు.


బకాయిలున్నాయి..

శ్రీనివాసప్రసాద్‌, పీడీ, డ్వామా, తిరుపతి జిల్లా

సెప్టెంబరు నుంచి ఉపాధి కూలీలకు బకాయిలున్నాయి. ఇప్పుడు వర్షా కాలంలో రోజు వారి కూలీల సంఖ్య సగటున 20 వేల నుంచి 23 వేల వరకూ ఉంది. వారికి రోజుకు ఒక్కొక్కరికీ సగటున రూ.200 నుంచి రూ.230 వరకూ వస్తుంది. ఇప్పటికే అలస్యమైంది. కూలీలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. విషయాన్ని ఉన్నతాధికారులకూ తెలియజేశాం. త్వరలోనే కూలీల ఖాతాల్లో వేతన సొమ్ము జమవుతుంది.


కూలి డబ్బులు అందరికీ అందుతాయి

చంద్రశేఖర్‌, డ్వామా పీడీ, చిత్తూరు జిల్లా

సెప్టెంబరు 19 నుంచి ఉపాధి కూలీలకు బకాయిలున్నాయి. కొంత ఆలస్యమైనా అందరికీ వారి ఖాతాల్లో వేతన డబ్బు జమవుతుంది. కేంద్ర ప్రభత్వం నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోకే నగదును జమ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని