logo

ఎంచక్కా.. పరిహారం కొట్టేయాలని!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చిత్తూరు మండలంలోని కొందరు రెవెన్యూ సిబ్బంది, చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థలోని పలువురు భూసేకరణ పరిహారం కొట్టేయాలని వ్యూహం పన్నారు.

Published : 07 Dec 2022 01:32 IST

ఎంఐజీ లే ఔట్‌లో సొమ్ము చేసుకునేందుకు పన్నాగం

చుడా అధికారులు, సిబ్బంది జత కలిశారని ఆరోపణలు

కోడిగుంటలో ఎంఐజీ లే ఔట్‌కు ఎంపిక చేసిన స్థలం

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చిత్తూరు మండలంలోని కొందరు రెవెన్యూ సిబ్బంది, చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థలోని పలువురు భూసేకరణ పరిహారం కొట్టేయాలని వ్యూహం పన్నారు. గతంలోని పట్టాదారుల వివరాలను ఆన్‌లైన్‌లో తొలగించి.. బినామీల పేర్లు ఎక్కించారనే ఆరోపణలున్నాయి. అప్పీళ్లకు విధించిన గడువు పూర్తి కాకుండానే ఈ తంతు ముగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ ముగిసే వరకు కొత్తగా ఆన్‌లైన్‌లోకి భూమి ఎక్కించుకున్న వ్యక్తులకు పరిహారం ఇవ్వకూడదని ఆదేశించడంతో ఈ బాగోతానికి అడ్డుకట్ట పడ్డట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ రెవెన్యూ అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం మధ్యాదాయ వర్గాలకు (ఎంఐజీ) తక్కువ ధరకే ప్లాట్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం మురకంబట్టు బైపాస్‌ తిమ్మసముద్రం రెవెన్యూ కోడిగుంటలో సుమారు 35 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు.  వాస్తవంగా ఈ ప్రాంతంలో చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్నారు. నాలుగైదేళ్లుగా వీరిలో కొందరు సాగుకు దూరంగా ఉన్నారు. తమకు ఉన్నదే తక్కువ విస్తీర్ణమైనందున భూములు ఇవ్వలేమని ఎక్కువ మంది భీష్మించారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి రూ.63 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పడంతో కొందరు ముందుకొచ్చారు. బాధిత రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.12 కోట్లు జమయ్యాయి. భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు పూర్తి చేసి.. అభివృద్ధి కోసం చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ (చుడా)కు అప్పగించాలి. తొలుత గ్రామసభ నిర్వహించినప్పుడు చుడా అధికారులు, సిబ్బంది కూడా జోక్యం చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

అప్పీళ్ల గడువు ముగియకుండానే ఆన్‌లైన్‌లోకి..: తిమ్మసముద్రం రెవెన్యూలో ఎంఐజీ లే ఔట్‌కు భూములు ఇవ్వడానికి నిరాకరించిన నలుగురి వివరాలను ఆన్‌లైన్‌ నుంచి తొలగించేశారు. ఏ ప్రాతిపదికపై వాటిని తొలగించారని ఆరా తీయగా ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. సదరు వ్యక్తుల అనుభవంలో ఉన్న పట్టా భూమి తమ పూర్వీకులదంటూ కొందరు డివిజన్‌ స్థాయి రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చారు. గతంలో ఇది డీకేటీగా ఉందని అందులో పేర్కొన్నారు.  వీరంతా స్థానికేతరులు కావడం గమనార్హం. అలాంటప్పుడు వీరికి భూమి ఎలా కేటాయించారనే సందేహాలున్నాయి. దీనిపై రెవెన్యూ కోర్టులో విచారణ జరగ్గా మూడు- నాలుగు నెలల వ్యవధిలోనే తీర్పు వచ్చింది. వెంటనే ఆన్‌లైన్‌లో కొత్త వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. ఇలా చేసే ముందు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని నోటీసులు ఇవ్వాలి. ఆ గడువు ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియను ముగించాలి. ఇందుకు భిన్నంగా మండల స్థాయి అధికారులు ఆగమేఘాలపై కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. అనంతరం తాము ఎంఐజీ లే ఔట్‌కు భూమి ఇస్తామంటూ వారు ముందుకు రావడం చకచకా జరిగిపోయాయి. కొత్త వ్యక్తులతో దరఖాస్తు చేయించిందే రెవెన్యూ అధికారులు అని సర్వత్రా చర్చ జరుగుతోంది. పరిహారం కొట్టేయడానికే ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది.

వివాదం తేలే వరకూ పరిహారం నిలుపుదల

రెవెన్యూలోని భూ వివాదం మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతోంది. నిజానిజాలు తేలేంత వరకూ పరిహారం నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చాం.

వెంకటేశ్వర్‌, జేసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని