logo

ఎట్టకేలకు రూ.184 కోట్లతో పనులు

చిత్తూరులో ఆగిపోయిన ఓ రహదారి ప్రాజెక్టు పూర్తిచేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చర్యలు చేపట్టింది.

Published : 07 Dec 2022 01:32 IST

కలెక్టరేట్‌, చీలాపల్లి వద్ద వీయూపీలు

గుడిపాలలో నంగమంగళం వద్ద ఆర్వోబీ

చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో కలెక్టరేట్‌ వద్ద ఆరు

వరుసల వెహికల్‌ అండర్‌ పాస్‌ ఏర్పాటు కానున్న ప్రాంతం

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: చిత్తూరులో ఆగిపోయిన ఓ రహదారి ప్రాజెక్టు పూర్తిచేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చర్యలు చేపట్టింది.. చిత్తూరు నగరం మీదుగా వెళ్లే చెన్నై-బెంగళూరు(ఎన్‌హెచ్‌-4) హైవేలో పనుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది.. ఎన్‌హెచ్‌ఏఐ తాజా చర్యలతో కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ ప్రాజెక్టుకు కొత్త ఊపిరినిచ్చింది.. మొత్తం రూ.184 కోట్లతో పలు పనులకు బిడ్లు ఆహ్వానించింది.

మూడు వీయూపీలు, ఒక ఆర్వోబీ..

చిత్తూరులోని కలెక్టరేట్‌ వద్ద ప్రస్తుతం ఉన్న నాలుగు వరసల మార్గం స్థానంలో నూతనంగా 28 మీటర్ల వెడల్పుతో ఒక ఆరు వరసల వెహికల్‌ అండర్‌ పాస్‌(వీయూపీ) నిర్మించనున్నారు. చీలాపల్లెలో సీఎంసీ ఆసుపత్రి వద్ద 14 మీటర్ల వెడల్పుతో మూడు వరసల వీయూపీ నిర్మితం కానుంది. గుడిపాల మండలం నంగమంగళం వద్ద ఆర్వోబీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు సర్వీసు రోడ్లు, లైటింగ్‌ పనుల నిర్వహణకు బిడ్లు పిలిచారు. ఇంకా స్థానిక రహదారులు, లైటింగ్‌ ఇతర పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు.

గతంలో చేపట్టిన పనుల్లో కలెక్టరేట్‌, సీఎంసీ ఆసుపత్రి వద్ద వీయూపీ మంజూరు కాలేదు. కలెక్టరేట్‌ వద్ద వాహనాల క్రాసింగ్‌కు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సీఎంసీ ఆసుపత్రి వద్ద జనసంచారం నిత్యం అధికంగా ఉంటుంది. ఈ కారణాలతో హైవే పనుల్లో మార్పులు చేసి వీయూపీలు మంజూరు చేశారు.

కర్ణాటక సరిహద్దు నుంచి ప్రారంభమయ్యే ఎన్‌హెచ్‌-4 చిత్తూరులో కలెక్టరేట్‌, సీఎంసీ ఆసుపత్రి, గుడిపాల మీదుగా తమిళనాడు సరిహద్దు వద్ద ముగుస్తుంది. కర్ణాటక సరిహద్దు నంగిలి నుంచి నలగాంపల్లె వరకు ఒక ప్రాజెక్టు పూర్తయింది. నలగాంపల్లె నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రెండో ప్రాజెక్టుగా చేపట్టిన పనులు గుత్తేదారు పూర్తిచేయని కారణంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి అడుగు ముందుకు పడలేదు. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 2న బిడ్డింగ్‌ ప్రారంభమైంది. గుత్తేదారులు 19 జనవరి, 2023లోగా టెండర్లు దాఖలు చేయాలి. పనులు దక్కించుకున్న గుత్తేదారులు ఏడాదిన్నరలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని