logo

తోమాల దర్శన టికెట్ల ఫోర్జరీ

శ్రీవారి తోమాల దర్శన టికెట్లను ఫోర్జరీ చేసి భక్తులను మోసగించి భారీగా నగదు వసూలు చేసిన ఓ దళారీపై, బ్రేక్‌ దర్శనాలను అధిక ధరలకు విక్రయించిన మరో ఇద్దరు దళారులపై తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 07 Dec 2022 01:32 IST

అధిక ధరలకు బ్రేక్‌ దర్శన టికెట్ల విక్రయం

ముగ్గురు దళారులపై తిరుమల టూటౌన్‌ పోలీసుల కేసు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి తోమాల దర్శన టికెట్లను ఫోర్జరీ చేసి భక్తులను మోసగించి భారీగా నగదు వసూలు చేసిన ఓ దళారీపై, బ్రేక్‌ దర్శనాలను అధిక ధరలకు విక్రయించిన మరో ఇద్దరు దళారులపై తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల టూటౌన్‌ ఎస్‌ఐలు రమేష్‌, మంజుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌కు చెందిన రాజేష్‌కుమార్‌ పొన్నుస్వామి శ్రీవారి తోమాలసేవా టికెట్లు ఇప్పించాలని ఏపీలోని భీమవరానికి చెందిన పంజారమణ ప్రసాద్‌ను కోరారు. దీంతో దళారీ 21 మందికి నాలుగు తోమాల సేవాటికెట్లు, గదుల కోసం భక్తుడి నుంచి రూ.62,500ను తన ఫోన్‌పేలో ఈ నెల 2న వేయించుకున్నారు. అనంతరం పాత తోమాలసేవా టికెట్ల నమూనాను ఫోర్జరీ చేసి నకిలీ టికెట్లను భక్తుడి సెల్‌ఫోన్‌కు పంపాడు. ఈ నెల 5న తిరుమల చేరుకున్న భక్తుడు ఏటీసీ కూడలి నుంచి దర్శనానికి వెళ్లాడు. ఈ సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కౌంటర్‌ సిబ్బంది టికెట్లను స్కానింగ్‌ చేయగా నకిలీవిగా గుర్తించారు. దీంతో విజిలెన్స్‌ సహకారంతో తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పంజారమణప్రసాద్‌ శ్రీవారి దర్శన టికెట్లను విక్రయిస్తూ అనేక పర్యాయాలు జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. ‌్ర మరో కేసులో తెలంగాణ రాష్ట్రం మల్కాజ్‌గిరికి చెందిన చెక్కల రామనాథ్‌ శ్రీవారి దర్శనార్థం బ్రేక్‌ దర్శనం ఇప్పించాలని హైదరాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సాయిని కోరాడు. సాయి తన స్నేహితుడి ద్వారా గుంటూరు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సిఫార్సు లేఖను తిరుపతిలో ఇప్పించారు. సదరు టికెట్‌ను జేఈవో కార్యాలయంలో అప్పగించాలని... సాయంత్రం మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చిన తర్వాత బ్రేక్‌ దర్శన టికెట్లను కొనుగోలు చేయాలని సూచించారు. అంతకు ముందే ఈనెల 1వ తేదీన 12 బ్రేక్‌ దర్శన టికెట్లకు రూ.48 వేలను తన బ్యాంక్‌ అకౌంట్‌లో సాయి వేయించుకున్నాడు. సదరు బ్రేక్‌ దర్శన టికెట్లతో దర్శనానికి వెళ్లిన భక్తుడు తనకు టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు విజిలెన్స్‌ అధికారులకు తెలిపాడు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు భక్తుడి ద్వారా తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సాయితోపాటు మరో దళారీని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని