logo

మూడేళ్లు..ముగింపునకు ఎన్నేళ్లో?

‘విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎన్నడూ లేనంతగా ఈ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం.

Published : 19 Jan 2023 05:52 IST

అసంపూర్తిగా నాబార్డు నిధులతో చేపట్టిన పాఠశాలల పనులు

* ఈ చిత్రంలో అసంపూర్తిగా కనిపిస్తున్న నిర్మాణాలు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోనివి. 2019-20లో రూ.60.10 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా నాబార్డు నిధులు మంజూరయ్యాయి. మూడేళ్లు నిండినా కొలిక్కి రాలేదు. ఎప్పుడు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.


గంగాధరనెల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనులు ప్రారంభ దశలోనే ఆగిపోవడంతో ‘నాడు- నేడు’ మూడో విడతలో నిర్మాణాలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.


సదుంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.


ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు(విద్య), బైరెడ్డిపల్లె: ‘విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎన్నడూ లేనంతగా ఈ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం’ అంటూ ప్రభుత్వం తరచూ చెబుతున్నా.. జిల్లాలో నాబార్డు నిధులతో మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కొన్నిచోట్లే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రారంభంలో బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడమే పనుల ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.


2020లో మొదలై...

‘నాడు- నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో అన్ని సర్కారు బడుల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీలు, నీటిశుద్ధి యంత్రాలు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడంతోపాటు బడి మానేసే వారి సంఖ్యా తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2019 నవంబరులో మొదటి విడతలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.354 కోట్లతో 1,500 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ఉన్నత పాఠశాలల్లో ఖర్చు అధికమవుతుందని భావించారు. 57 పాఠశాలల్లో రూ.42.92 కోట్ల నాబార్డు నిధులతో పనులు చేపట్టారు. 2020 ప్రారంభంలో వీటి నిర్మాణం మొదలైంది. 15-18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ‘నాడు- నేడు’ తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో 2021 చివరి నాటికి పనులు పూర్తి కాగా నాబార్డు నిధులతో చేపట్టినవి సాగుతూనే ఉన్నాయి.


బిల్లుల ఆలస్యంతో...

ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 19 పాఠశాలల్లోనే పనులు పూర్తయ్యాయి. గంగాధరనెల్లూరు, సదుం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభంలోనే పనులు నిలిచిపోవడంతో వీటిని మూడో విడత ‘నాడు- నేడు’కు మార్చారు. చంద్రగిరి, నారాయణవనం, పెనుమూరు, పిచ్చాటూరు, పులిచెర్ల, కమ్మకండ్రిగ తదితర ప్రాంతాల్లో మూడేళ్ల క్రితమే పనులు మొదలైనా ఇప్పటికీ తుది దశకు చేరలేదు. ఇవి పూర్తయితే విద్యార్థులకు అదనపు తరగతి గదులు అందుబాటులోకి రావడంతోపాటు గ్రంథాలయం, డిజిటల్‌ తరగతుల నిర్వహణ సాగుతుంది. ప్రధానంగా చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడం, తదనంతర కాలంలో అంచనాలు పెరిగిపోవడంతోనే నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపితే పనులు ముగింపు దశకు చేరుకుంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని