logo

సాధారణ నిధుల నుంచే మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల నిర్మాణం

తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం పరస్పర పొగడ్తలతో సాగింది. ప్రధానంగా మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల కోసం రూ.37.61 కోట్ల నగరపాలిక సాధారణ నిధులు కేటాయించేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు.

Published : 19 Jan 2023 05:52 IST

నగరపాలికలో శెట్టిపల్లె విలీనానికి ఆమోదం

ప్రసంగిస్తున్న మేయర్‌ శిరీష

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం పరస్పర పొగడ్తలతో సాగింది. ప్రధానంగా మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల కోసం రూ.37.61 కోట్ల నగరపాలిక సాధారణ నిధులు కేటాయించేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు.
మేయర్‌ డాక్టర్‌ శిరీష అధ్యక్షతన ఎస్వీయూ సెనేట్‌ హాల్లో బుధవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో 25 అజెండా అంశాలను కమిషనర్‌ అనుపమ అంజలి ప్రవేశపెట్టారు. మీడియాకు అనుమతి లేదంటూ ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించి.. పాత్రికేయులను సమావేశం నుంచి బయటకు పంపించారు. తిరుపతి అర్బన్‌ మండల పరిధిలోని శెట్టిపల్లె, శెట్టిపల్లె ఎస్సీ వాడ, సి.ఆర్‌.ఎస్‌. క్వార్టర్స్‌, ఉప్పరపాలెం, వినాయకనగర్‌ ప్రాంతాలను నగరపాలికలోకి విలీనం చేసేందుకు ఉన్నతాధికారుల సూచనల మేరకు అభిప్రాయ సేకరణ చేశామని, ఎలాంటి అభ్యంతరాలు రాలేదని నిర్ధారిస్తూ కౌన్సిల్‌లో తీర్మానం ప్రవేశపెట్టడంతో విలీనప్రక్రియ అధికారికంగా పూర్తయింది. వైకుంఠపురంలో నగరపాలిక నిర్మించిన కూరగాయల మార్కెట్‌లో బహిరంగ వేలం ద్వారా దొడ్డిదారిలో  2020 డిసెంబరులో 47 దుకాణాలు దక్కించుకున్న లీజుదారులు ఇప్పటి వరకు రుసుములు చెల్లించకపోగా.. వాటిని నెలసరి అద్దెకు కాకుండా రోజువారీ రూ.15 అద్దెకు కేటాయించాలని లీజుదారుల వినతిని కౌన్సిల్‌ ఆమోదించి ఒక్కో దుకాణానికి నెలకు రూ.450 అద్దె నిర్ణయించారు. నగరపాలికకు చెందిన పదుల సంఖ్యలో దుకాణాల లీజు పొడగింపు, అద్దెల తగ్గింపు, అన్న క్యాంటీన్లను లీజుకు ఇచ్చే ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఎస్వీ సంగీత కళాశాల, కోర్టు సముదాయాల రోడ్లను వెడల్పునకు నిధులు కేటాయించారు. పేదలకు ఎం.కొత్తపల్లె వద్ద ఇచ్చిన ఇంటి స్థలాలు కొండలు, గుట్టల మధ్య ఉండడంతో వాటిని చదును చేసేందుకు రూ.2 కోట్లు మంజూరు చేశారు. 2019లో తిరుపతికి తాగునీటి సరఫరా ఖర్చయిన నిధులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా చేసిన గుత్తేదారులకు చెల్లించాల్సిన రూ.6.85 కోట్లు నగరపాలిక నుంచి చెల్లించే అజెండాను సభ్యులు తిరస్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని