logo

సమన్వయంతో సంక్షేమ ఫలాలు అందజేద్దాం

అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందజేద్దామని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు.

Updated : 27 Jan 2023 05:02 IST

గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు జడ్పీ, వ్యవసాయం: అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందజేద్దామని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. అనంతరం లబ్ధిదారులకు రూ.1,163 కోట్ల ఆస్తులను పంపిణీ చేశారు. జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, జేసీ వెంకటేశ్వర్‌, శిక్షణ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు.

జిల్లా ప్రగతి గణాంకాలు..  

జిల్లాలో 39,847 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది.  వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు 2,23,092 మంది రైతులకు రూ.164.65 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్‌ ద్వారా 1,99,923 రైతు కుటుంబాలకు రూ.79.98 కోట్లు జమ చేశాం. సూక్ష్మ నీటి సాగు ప్రాజెక్టు కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 4,358 మంది రైతులకు రూ.34.72 కోట్లతో 3,816 హెక్టార్లలో డ్రిప్‌ పరికరాలు అందజేశాం. పేదల సొంతింటి కల సాకారం చేసే ప్రక్రియలో మొదటి దశలో 71,783 గృహాల నిర్మాణానికి రూ.1,292 కోట్లు పీఎంఏవై, వైఎస్సార్‌ అర్బన్‌ హౌసింగ్‌ పథకం కింద విడుదలయ్యాయి. ఏపీ టిడ్కో ద్వారా రూ.295 కోట్లతో 4,368 గృహ నిర్మాణాలు చేపట్టాం.  వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో మూడేళ్లలోపు వయస్సు కల్గిన 58,937 మంది పిల్లలకు బాలామృతంతో పాటు కోడిగుడ్డు, 23,707 మంది గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్‌ కిట్లతో పాటు సంపూర్ణ భోజనం అందిస్తున్నాం.  వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద 139 గ్రామాల్లో 91,385 ఎకరాల వ్యవసాయ భూములకు రీ సర్వే పూర్తి చేశాం.

డీఆర్‌డీఏ శకటానికి ప్రథమ బహుమతి: డీఆర్‌డీఏ శకటానికి మొదటి బహుమతి, చిరుధాన్యాలను ప్రదర్శించిన వ్యవసాయ శాఖ శకటానికి రెండో బహుమతి, మొబైల్‌ నిఘా వ్యవస్థ కలిగిన వాహనాన్ని ప్రదర్శించిన పోలీసు శాఖకు తృతీయ బహుమతి దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని