logo

అనుమతుల్లోనే మతలబు

ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌లో గ్రావెల్‌ మాఫియా చెలరేగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా చెరువులు, గుంతలు, ప్రభుత్వ స్థలాల్లో యంత్రాలను పెట్టి రేయింబవుళ్లు టిప్పర్లు, ట్రాక్టర్లతో జాతీయ రహదారి మీదుగానే తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.

Published : 27 Jan 2023 02:35 IST

గ్రావెల్‌ కొల్లగొడుతున్న మాఫియా
న్యూస్‌టుడే, సూళ్లూరుపేట

జాతీయ రహదారి పక్కన స్థిరాస్తి క్షేత్రంలో తోలిన గ్రావెల్‌

ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌లో గ్రావెల్‌ మాఫియా చెలరేగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా చెరువులు, గుంతలు, ప్రభుత్వ స్థలాల్లో యంత్రాలను పెట్టి రేయింబవుళ్లు టిప్పర్లు, ట్రాక్టర్లతో జాతీయ రహదారి మీదుగానే తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.

ఏకొల్లులో తవ్వకాలతో ఏర్పడిన గుంతలు

సూళ్లూరుపేట సమీపాన జాతీయ రహదారిని అనుకుని కోటపోలూరు రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28-4, 28-5, 28-6, 28-7, 28-8, 28-9, 28-11లో వ్యవసాయ భూమిని స్థిరాస్తి క్షేత్రంగా మార్చేందుకు నెల్లూరుకు చెందిన పలువురు వ్యాపారులు గతేడాది కొనుగోలు చేశారు. ఈ భూములను చదునుచేసే పనులను స్థానిక అధికారపార్టీ నేతలకు అప్పగించారు. వారు సొంత పొలాలకంటూ కోటపోలూరు పంచాయతీలోని చిన్నగారి చెరువు, పెద్దగారి చెరువు నుంచి మట్టి తరలించడానికి నెల్లూరు జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌కు విన్నవించారు. ఇందుకు స్థానిక రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన పత్రాలను చూపారు. అధికార పార్టీ నేతలు కావడంతో ఐదువేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తూ ఎస్‌ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఉచితంగా మట్టిని తీసుకెళ్లేలా సహకరించారు. సర్వే నంబర్లు సైతం తప్పులతడకగా కనబరిచారు. అసలు భూములు కోటపోలూరు రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28-4, 28-5, 28-6, 28-7, 28-8, 28-9, 28-11లో ఉంటే.. అదే రెవెన్యూలో సర్వేనంబరు 33-7లో ఉన్నట్లు పత్రాలు చూపి అనుమతులు పొందారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గడువు దాటిన తర్వాతా మట్టి తవ్వకం, తరలింపు జరిగింది. ప్రస్తుతం అదే భూమికి రాత్రివేళ ఇబ్బడిముబ్బడిగా గ్రావెల్‌ తోలి పైపాటుగా చదును చేస్తున్నారు. దొరవారిసత్రం మండలంలోని ఆనేపూడి, ఏకొల్లు ప్రాంతాల నుంచి టిప్పర్లలో తీసుకొస్తున్నారు.

చెరువులు, ఇతర ప్రాంతాల నుంచి స్థిరాస్తి క్షేత్రాలకు, ఇతర నిర్మాణాలకు మట్టి, గ్రావెల్‌ తీసుకోవాలంటే గనులశాఖ అనుమతి తప్పనిసరి. క్యూబిక్‌ మీటరుకు రూ.250 చెల్లించాలి. సూళ్లూరుపేట, దొరవారిసత్రం ప్రాంతాల్లో ఎలాంటి చెల్లింపులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.


చర్యలు తీసుకుంటాం

గోపినాథ్‌రెడ్డి, తహసీల్దార్‌, దొరవారిసత్రం

దొరవారిసత్రం మండలంలోని ఆనేపూడి, ఏకొల్లు ప్రాంతాలతోపాటు ఇతరచోట్ల గ్రావెల్‌ తవ్వకాలు, తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవు. దీనిపై చర్యలు తీసుకుంటాం. సిబ్బందిని ఆదేశించి ప్రత్యేక నిఘా ఉంచుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని