Nara Lokesh-Yuvagalam: నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం

ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

Updated : 27 Jan 2023 16:30 IST

కుప్పం పట్టణం: ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా లోకేశ్‌ చూడనున్నారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి తెదేపా శ్రేణులు తరలివచ్చాయి. ఇప్పటికే ముఖ్యనేతలు, కార్యకర్తలు కుప్పం చేరుకున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణతో పాటు పలువురు తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సినీనటుడు తారకరత్న తదితరులు పాదయాత్రలో యువనేత వెంట నడుస్తున్నారు. 

400 మంది వాలంటీర్లు.. 200 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది

మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం పరిధిలోని కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు 50వేల మంది తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. వేదికపై 300 మంది కూర్చొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కుప్పం నాయకులు కలిపి మొత్తం 300 మంది వేదికపై ఉండనున్నారు. బహిరంగసభ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు తెదేపా నాయకులే 400 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వీరికితోడు అదనంగా మరో 200 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండనున్నారు. బహిరంగసభకు హాజరయ్యేవారికోసం భోజనాలను సిద్ధం చేశారు. 

లోకేశ్‌ పాదయాత్ర జరగనున్న 400 రోజులూ ఆయన వెంట 400 మంది వాలంటీర్లు ఉండనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలను గుర్తించిన తెలుగుదేశం అధినాయకత్వం.. వారిని వాలంటీర్లుగా నియమించింది. వీరి కోసం లోకేశ్‌ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్‌ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచారు. అక్కడే భోజన ఏర్పాట్లూ చేశారు. వీరికి ఎలాంటి లోటూ రాకుండా చూసుకునే బాధ్యతను చిత్తూరు జిల్లాలోని తెలుగు యువత నాయకులు, కార్యకర్తలకు అప్పగించారు. పాదయాత్ర జరిగే 400 రోజులూ కాన్వాయ్‌లోనే లోకేశ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పక్కనే వాలంటీర్లు బస చేస్తారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా, దాడులకు దిగినా ఆయనను రక్షించడానికి అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని