logo

పదపదమంటూ.. పాదం ఆగదంటూ

అడుగడుగునా అభివాదాలు, ఆశీర్వాదాలు.. పల్లెపల్లెనా అభిమానం.. పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా.. ఉత్సవంగా.. వడివడిగా.. ఒరవడిగా.. పసుపు ‘దండు’లా శ్రేణులు, అభిమానులు నీడగా.. తోడుగా.. లోకేశ్‌తో అడుగులు కలిపారు.

Published : 31 Jan 2023 03:56 IST

పల్లెపల్లెనా ఘన స్వాగతం
నాలుగో రోజు పలమనేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన పాదయాత్ర

యువతులకు  స్వీయ చిత్రం  తీస్తూ..

పలమనేరు, వి.కోట, న్యూస్‌టుడే: అడుగడుగునా అభివాదాలు, ఆశీర్వాదాలు.. పల్లెపల్లెనా అభిమానం.. పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా.. ఉత్సవంగా.. వడివడిగా.. ఒరవడిగా.. పసుపు ‘దండు’లా శ్రేణులు, అభిమానులు నీడగా.. తోడుగా.. లోకేశ్‌తో అడుగులు కలిపారు. జేజేలు కొట్టారు. గజమాలలతో స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి హర్షించారు. ‘నిన్ను చూడటానికి వచ్చాను నాన్న..’ అంటూ వృద్ధుల అనురాగం. స్వీయచిత్రం తీసుకోవాలని విద్యార్థుల ఆరాటం. ఎదురేగి.. అన్నకు నుదుట తిలకం దిద్దాలని.. హారతి పళ్లేలతో అక్కచెల్లెమ్మల ఆత్రుత.. సమస్యలు తీర్చేందుకు వస్తున్నారని నిరుద్యోగ యువతలో ఆశ.. మా కన్నీరు మీరే తుడవాలని బాధితుల వేడుకోలు. వి.కోట మండలంలో సోమవారం కనిపించిన దృశ్యాలివి. చల్దిగానిపల్లెలో మొదలైన పాదయాత్రలో రోడ్డు పొడవునా దాదాపు 7 కి.మీ దూరం ప్రజలు మహిళలు స్వాగతం పలికారు.


‘వైకాపా హయాంలో ముస్లింల అభ్యున్నతి శూన్యం’

వి.కోట: స్థానిక ఖాజీపేటలో ముస్లింమైనార్టీలతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. పాదయాత్రలో మొదటి ముస్లిం మైనార్టీల సమావేశం ఇదే కావడంతోపాటు దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది. ‘వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీలకు రక్షణ కరవైంది. ముస్లింల సంక్షేమాన్ని వైకాపా పూర్తిగా విస్మరించింది. కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నిధులు ఇవ్వలేదు. వైకాపా అధికారం చేపట్టగానే గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇస్తున్న పథకాలను తొలగించింది’ అని మాజీ ఎమ్మెల్సీ          షరీఫ్‌, మాజీ ఎమ్మెల్యే అత్తర్‌ చాంద్‌బాషా తెలిపారు.


వలసలు ఆగాలి.. వడ్డెర్ల జీవితాలు బాగుపడాలి

సభలో ప్రసంగిస్తున్న లోకేశ్‌

పలమనేరు, న్యూస్‌టుడే: ‘వడ్డెర్ల జీవితాల్లో వెలుగులు నిండాలి. నిత్యం వారు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వలసలు వెళ్లడం ఆగాలి. గత ప్రభుత్వంలోనే వడ్డెర్లకు మేలు జరిగింది.. మీ కోసం నేను పోరాటం చేయడానికి వచ్చా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. వి.కోట మండలం గందారుమాకులపల్లెలో వడ్డెర సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ‘మీకు గతంలో చంద్రన్న బీమా అందేది. గత ప్రభుత్వంలో పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో దాదాపు 25 వేల మంది వరకు వడ్డెర్లకు పలు రకాలుగా లబ్ధి చేకూరింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రూ.70 కోట్లతో సమాఖ్య ద్వారా మేలు చేశాం. ప్రస్తుత ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టడం లేదు. చేతిలో ఉన్న కొన్ని మైన్స్‌ను కూడా ఈ ప్రభుత్వం వచ్చాక  లాక్కుంది. వడ్డెర్ల కోసం గతంలో చంద్రబాబునాయుడు సత్యపాల్‌ కమిటీ వేశారు. ఎస్టీ జాబితాలో ఉండాల్సిన వడ్డెరలు ప్రస్తుతం బీసీలుగానే కొనసాగుతున్నారు. మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు కృషి చేస్తా’ అని స్పష్టం చేశారు.

వి.కోటలో లోకేశ్‌ను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు


ఆసక్తికర వ్యాఖ్యలు.. కేరింతలు

* వి.కోటలో యువజనులతో మాట్లాడే సమయంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి పేరు ప్రస్తావించారు. అప్పుడు సభలో పెద్దగా కేకలు వినిపించాయి. ‘అమరన్నకు జై అంటూ..’ కేకలు పెట్టడంతో లోకేశ్‌ సరదాగా ‘ఏమన్నా.. నాకన్నా ఫాలోయింగ్‌.. నీకే ఎక్కువగా ఉందే..’ అన్నారు. దానికి సభలోని వారంతా కేరింతలు కొట్టారు.

* వడ్డెర్ల సభలో.. ‘భయం మా బ్లడ్‌లోనే లేదు..  మీ కోసం పోరాటం చేస్తా..’ అన్నప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టారు.

* అక్కడే మహిళలు సభలోకి రావడానికి ప్రయత్నించారు. వీరికి వీలు పడకపోవడాన్ని గమనించిన లోకేశ్‌.. ‘అమ్మా ఇలా రండి.. వారికి దారి వదలండి.. వారిని సభలోకి రానివ్వాలి. నాకు మహిళల రక్షణే ముఖ్యం..’ అన్నప్పుడు పెద్దగా చప్పట్లు కొట్టారు.

* వి.కోట సభలో.. ‘ఈ ప్యాలెస్‌ పిల్లి జగన్‌.. దిల్లీకి వంగి వంగి సార్‌ సార్‌ అంటూ వెళ్తుంటాడు..’ అన్నప్పుడు శబ్దాలు మిన్నంటాయి.


పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగాలు

పలమనేరు, న్యూస్‌టుడే: ‘పరిశ్రమలు ఉంటేనే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా నేను, పరిశ్రమలశాఖ మంత్రిగా అమరనాథరెడ్డి పరిశ్రమల స్థాపన కోసం ఎంతో కృషి చేశాం. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టండని అడిగితే చంద్రబాబునాయుడు పేరు ఉంటే చాలు పెట్టేస్తామని వచ్చేవారు. ఆయన ప్రభుత్వంలో 5,13,351 మంది యువతకు అప్పట్లో పలు రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమలను తరిమేస్తోంది’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు. సోమవారం వి.కోట పట్టణంలోని జీఎంఆర్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


తెదేపా ప్రభుత్వం ఏర్పడటమే లక్ష్యం

పాదయాత్రలో మేము సైతం అంటూ దివ్యాంగులు పాల్గొన్నారు. తాము ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి, మార్కాపురం నుంచి వచ్చామన్నారు. 400 రోజులూ లోకేశ్‌ వెంటే ఉండి తమ అభిమానాన్ని తెలుపుతామన్నారు. తెదేపా ప్రభుత్వం ఏర్పడటమే తమ లక్ష్యమని అందుకే ఈ యాత్రలో పాల్గొని ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు.


ఆగాగు బిడ్డ.. హారతివ్వాలి

ఈమె పేరు నారాయణమ్మ. చల్దిగానిపల్లి వద్ద లోకేశ్‌కు హారతివ్వాలనుకుంది. పళ్లెంలో పసుపు నీళ్లు తెచ్చేసరికి పాదయాత్ర కొద్ది దూరం ముందుకు వెళ్లిపోయింది. దాంతో ఆరుపదుల వయసులోనూ పరుగుపరుగున వెళ్లి నారా  లోకేశ్‌కు హారతిచ్చి ఆనందించింది.


సుదూరాల నుంచి..

పలమనేరు, న్యూస్‌టుడే: పాదయాత్రలో లోకేశ్‌తో పాదం కలపడానికి విదేశాల నుంచి అభిమానులు వచ్చారు. సోమవారం వి.కోట పాదయాత్రలో వీరు ఆయనతో కలిసి నడిచారు.


అమెరికా నుంచి వచ్చాం
- డాక్టర్‌ హరిప్రసాద్‌, అమెరికా

లోకేశ్‌ పాదయాత్ర ఎంతోమందిలో చైతన్యం తెస్తోంది. మా వంతు పాదం కలపాలని అమెరికా నుంచి  వచ్చాం. రాబోయే రోజుల్లో యువత మంచి భవిష్యత్తు అందుకోవాలని కోరుకుంటున్నాం. అందుకోసం ఆయన చేస్తున్న ఈ యజ్ఞానికి మేము సైతం సహకరిస్తాం.


మీ పైనే ఆశలు పెట్టుకున్నాం
 - మురళి, వి.కోట

అన్నా నేను ఎంఏ చదివా. చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా. నా చెల్లి, తమ్ముడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. కుప్పం ప్రాంతంలో ఐటీ కంపెనీ పెడితే  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. యువత  చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. మీ పైనే మా ఆశలు పెట్టుకున్నాం. మీరు యువత కోసం అండగా నిలవాలి.  


ఒప్పంద ఉద్యోగం తీసేశారు
- రాజశేఖర్‌, పెద్దపంజాణి

నేను ఒప్పంద ఉద్యోగిగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశా. ఈ ప్రభుత్వంలో నాతో పాటు కొందరి ఉద్యోగాలు పోయాయి. పెద్దపంజాణి మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో పలమనేరు వరకు వెళ్లలేక చాలామంది చదువుకు దూరమవుతున్నారు. మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.


యువతకు దారి చూపే నేత
- సజ్జా అజిత్‌, విజయవాడ

యువతకు దారి చూపించేది భవిష్యత్తులో లోకేశ్‌ అన్న మాత్రమే. అందుకే ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నేను విజయవాడ నుంచి ఆయన కోసమే వచ్చా. పాదయాత్రలో పాల్గొంటున్నా. ఈ ప్రభుత్వం కేసుల పేరిట యువతను భయబ్రాంతులకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రశాంతంగా జీవించాలి.. ఉద్యోగాలు రావాలంటే తప్పకుండా లోకేశ్‌తోనే అది సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నాం.


మహిళలూ వెంట నడుస్తున్నారు
- కృష్ణప్రియ, అమెరికా

లోకేశ్‌ పాతయాత్రలో మహిళలు కూడా నడుస్తున్నందుకు సంతోషంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే మహిళలకు రక్షణ ఉందని మా అభిప్రాయం. అందుకే నేను అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ పాదయాత్రలో పాలు పంచుకుంటున్నాను. మా వంతు మహిళలను చైతన్య పరచడానికి కృషి చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు