logo

మాడ వీధుల్లోకి సీఎంవో స్టిక్కరున్న కారు

తిరుమలలో భద్రతా వైఫల్యం మరోమారు వెలుగుచూసింది. మంగళవారం సీఎంవో స్టిక్కరున్న ఓ కారు (ఏపీ 39బీజే 5757) ఆలయ రక్షణ గేట్లను దాటుకుని శ్రీవారి మాడ వీధిలో పుష్కరిణి హారతి ఇచ్చే మండపం వద్దకు వచ్చింది.

Published : 01 Feb 2023 04:16 IST

పట్టించుకోని భద్రతా సిబ్బంది

ఈనాడు, తిరుపతి - న్యూస్‌టుడే, తిరుమల: తిరుమలలో భద్రతా వైఫల్యం మరోమారు వెలుగుచూసింది. మంగళవారం సీఎంవో స్టిక్కరున్న ఓ కారు (ఏపీ 39బీజే 5757) ఆలయ రక్షణ గేట్లను దాటుకుని శ్రీవారి మాడ వీధిలో పుష్కరిణి హారతి ఇచ్చే మండపం వద్దకు వచ్చింది. మాడ వీధుల్లోకి రాకూడదని అక్కడున్న మీడియా సిబ్బంది వారించినా డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మంత్రి వాహనమని ఒకసారి, కాదని మరోసారి చెప్పి అక్కడి నుంచి నేరుగా వీవీఐపీ పార్కింగ్‌ వద్దకు వెళ్లిపోయాడు. అప్పటికీ తితిదే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోలేదు. రాంభగీచ ప్రధాన గేటు దగ్గర నుంచి మాడ వీధిలోకి వెళ్లేందుకు నాలుగంచెల భద్రత ఉంటుంది. వీఐపీ, వీవీఐపీల వాహనాలను రాంభగీచ 1, 2 ఎదురుగా ఉన్న పార్కింగ్‌ వరకే అనుమతిస్తారు. కానీ, సదరు డ్రైవరు వీటన్నింటినీ దాటుకొని పుష్కరిణి హారతి (రథం ఉన్న ప్రాంతం) వరకు వాహనం తీసుకెళ్లాడు. ఇంత జరిగినా విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోలేదు. ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లలేదు. దీనిపై తితిదే ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..‘వాహనం నిబంధనలకు విరుద్ధంగా వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. దాతలు ఇచ్చే వాహనాలు పూజ చేసే ప్రాంతం వరకు వెళ్లి వెనక్కి వచ్చిందన్న విషయం తెలిసింది. దీనిపై అధికారుల నుంచి తగిన నివేదిక తెప్పించుకుంటాం. భద్రత కట్టుదిట్టం చేస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని