logo

రూ.10 లక్షల విలువైన మద్యం ధ్వంసం

వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి మంగళవారం తెలిపారు. 25 కేసులకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల విలువైన మద్యాన్ని ఊటువంక వద్ద రోడ్డురోలర్‌తో తొక్కించి నాశనం చేశామన్నారు.

Published : 01 Feb 2023 04:16 IST

రోలర్‌తో మద్యాన్ని ధ్వంసం చేయిస్తున్న పోలీసులు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి మంగళవారం తెలిపారు. 25 కేసులకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల విలువైన మద్యాన్ని ఊటువంక వద్ద రోడ్డురోలర్‌తో తొక్కించి నాశనం చేశామన్నారు. మద్యం తరలిస్తూ పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలకు బహిరంగ వేలం పాట నిర్వహించగా రూ.14 వేల ఆదాయం వచ్చిందన్నారు.


మనస్తాపంతో ఒడిశా వాసి ఆత్మహత్య

గంగవరం, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని సరస్వతినగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశాకు చెందిన హరిరాంరావత్‌(43) తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంలోని బోర్‌వెల్స్‌లో పనిచేస్తున్నారు. మండల పరిధిలోని సరస్వతినగర్‌లో బోరు వేయడానికి సోమవారం వచ్చారు. అక్కడే రాత్రి చెట్టుకు టవల్‌తో ఉరేసుకొని మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో మృతుడు మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. మృతినికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


విద్యుదాఘాతంతో మహిళ మృతి

చౌడేపల్లె, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కాగతి పంచాయతీ పెద్దూరులో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఫ్యారీమా (55) ఆవుల పెంచుతూ జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఆవుల కోసం షెడ్డు ఏర్పాటు చేసింది. అందులోకి విద్యుత్‌ బల్బు కోసం వైర్లు లాగారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పాలు పితుకుతున్న క్రమంలో పైపును పట్టుకోవడంతో విద్యుదాఘాతాని గురైంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. గాయపడ్డ ఆమెను స్థానికులు మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.


చెట్టుపై నుంచి పడి తితిదే ఉద్యోగి దుర్మరణం

తిరుమల, న్యూస్‌టుడే: చెట్టుపై నుంచి పడి తితిదే గార్డెనింగ్‌ ఉద్యోగి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గ్రామీణ మండలం అవిలాలలో నివాసం ఉంటున్న కె.వెంకటేశులు(59) తితిదే గార్డెనింగ్‌ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ వైభవోత్సవ మండపం, శ్రీవారి ఆలయం ముందు మామిడాకులతో తోరణాలు కట్టే పనులు నిర్వహించేవారు. జీఎన్‌సీ సమీపంలోని ఓ ఉద్యానవనంలో మామిడి చెట్టుపైకి ఎక్కి ఆకులు కోస్తుండగా కొమ్మ విరిగి పడిపోయాడు. వెంటనే తితిదే అశ్విని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తిరుమల టూటౌన్‌ పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని