logo

19 పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు

‘జిల్లా.. పరిశ్రమలకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం కావడంతో పెద్దసంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి.

Updated : 01 Feb 2023 06:53 IST

వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
న్యూస్‌టుడే’తో జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్‌రెడ్డి
న్యూస్‌టుడే, తిరుపతి(కలెక్టరేట్‌)

‘జిల్లా.. పరిశ్రమలకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం కావడంతో పెద్దసంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. కొత్త పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రూ.13,800 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు సింగిల్‌ డెస్క్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ విధానంలో ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తున్నాం’ అని జిల్లా పరిశ్రమల అధికారి ఈ.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘న్యూస్‌టుడే’తో ముఖాముఖిలో మాట్లాడారు.

జిల్లా పరిధిలో బెంగళూరు, చెన్నై జాతీయ రహదారులు, కృష్ణపట్నం, చెన్నై పోర్టు అతి దగ్గరలో ఉన్నాయి. పరిశ్రమల్లో తయారు చేసే వస్తువులు, ఉత్పత్తులు ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు అనుకూలమైన ప్రాంతం. ప్రస్తుతం పెద్ద  పరిశ్రమలు 173, చిన్న పరిశ్రమలు 4,798 వరకు ఉన్నాయి. కొత్తగా మరో 19 పెద్ద పరిశ్రమలకు,  46 చిన్న పరిశ్రమలకు దరఖాస్తు చేసుకోగా వాటికి అనుమతులు మంజూరు చేశాం. కొత్త పరిశ్రమల రాకతో దాదాపు రూ.13,800 కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలకు కావాల్సిన భూములు కేటాయించేందుకు నాయుడుపేట సమీపంలో ఏపీఐఐసీ దాదాపు మూడు వేల ఎకరాల వరకు సేకరించింది. కొత్త వాటికి శ్రీసిటీలోనే కాకుండా నాయుడుపేట, శ్రీకాళహస్తి- విశాఖ పారిశ్రామిక  కారిడార్‌ ప్రాంతాల్లో భూములు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కారిడార్‌ ప్రాంతంలో 12 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడత రెండు వేల ఎకరాల  సేకరణ పూర్తి చేశాం.

ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆటో మొబైౖల్స్‌, మాంసం ఉత్పత్తులు దేశ, విదేశాలకు దాదాపు రూ.పదివేల కోట్ల విలువైన ఎగుమతులు, దిగుమతులు జరగుతున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తే రానున్న రోజుల్లో ఎగుమతులు, దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.కోటి వరకు రాయితీలు అందిస్తున్నాం. బీసీ పారిశ్రామికవేత్తలకు రూ.75 లక్షల వరకు ప్రోత్సాహక రాయితీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అనుమతుల విషయంలో ఆలస్యం చేయకుండా నిబంధనలు అనుసరించే నిర్ణీత సమయంలోనే పారదర్శకంగా మంజూరు చేస్తున్నాం.


ముందుకొచ్చిన మూడు ఏసీ యంత్రాల తయారీ సంస్థలు

శ్రీకాళహస్తి మార్గంలో అంతర్జాతీయ ఏసీ యంత్రాల తయారీ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. బ్లూస్టార్‌, డైకిన్‌, హెవెల్స్‌ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తులో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని