logo

పర్యాటకం.. ప్రాధాన్యం

ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్యాత్మికానికీ పర్యాటకానికీ అనువైన ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాలను (గమ్యస్థానాలు) ఎంపిక చేసి అక్కడ స్థానిక, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Updated : 02 Feb 2023 09:53 IST

జల్‌జీవన్‌తో తీరనున్న కష్టాలు

కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులతో ఆశలు

ఈనాడు-తిరుపతి; న్యూస్‌టుడే, చిత్తూరు జిల్లా పంచాయతీ, వ్యవసాయం, కలెక్టరేట్‌, విద్య, నగరం : ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్యాత్మికానికీ పర్యాటకానికీ అనువైన ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాలను (గమ్యస్థానాలు) ఎంపిక చేసి అక్కడ స్థానిక, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పర్యాటక కేంద్రంగా విరాజిల్లేందుకు ఆస్కారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ద్వారా తిరుపతి జిల్లాకు పలు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 


* జల్‌జీవన్‌ మిషన్‌ కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.70 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. 2022-23 సంవత్సరానికి జిల్లాకు రూ.340కోట్లు కేటాయించగా.. అందులో రూ.35కోట్లు మేరకు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 3.61 లక్షల కుటుంబాలు ఉన్నాయి.  రూ.276 కోట్లు వచ్చే ఆస్కారం ఉంది.


సమగ్ర శిక్షకు రూ.100 కోట్లు

జిల్లాలో 2,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1.68లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమగ్ర శిక్ష తరఫున జిల్లాకు ఈ ఏడాది రూ.100కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

తిరుపతి జిల్లా పరిధిలో ఓజిలి, బీఎన్‌కండ్రిగ మండలాల్లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయి.  బడ్జెట్‌లో రూ.5943 కోట్లు కేటాయించింది. దీంతో ఇక్కడ మరింత మౌలిక సదుపాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఉపాధ్యాయుల నియామకానికీ కేంద్రం ఆమోదించింది.


డిజిటల్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ కేంద్రాలు

పంట రుణాలకు రూ.20లక్షల కోట్లు కేటాయించారు. జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో సుమారు 3.10లక్షల మంది రైతులకు పంట రుణాల కింద రూ.5,123కోట్ల అందజేస్తున్నారు. అధిక కేటాయింపులతో కర్షకులకు పంట రుణాల మంజూరు మరింత సరళతరం కానుంది.  యువతను ప్రోత్సహించేందుకు గ్రామ స్థాయిలో ఓపెన్‌ సోర్స్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కేంద్రాల ఏర్పా టుకు ప్రత్యేక నిధులు కేటాయింపుతో ఇవి జిల్లాకు అందిరానున్నాయి.


ఎన్‌హెచ్‌ఏఐ కింద  రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1.62 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు పొందుపర్చింది. ఇప్పటికే మదనపల్లె-తిరుపతి, తిరుపతి-కడప రహదారులను నాలుగు వరుసల కింద మార్పు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిధులు రాబట్టుకుంటే రహదారుల నిర్మాణం చేపట్టవచ్చు.


జిల్లాలో ప్రస్తు తం 29 వేల మంది రైతులు  35 వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం పద్ధతిలో సాగు చేస్తుండగా.. 110 ప్రకృతి వ్యవసాయం వనరుల కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్‌ పుణ్యమా జిల్లాలో ప్రకృతి సేద్యం విస్తరించి రైతులకు లబ్ధి చేకూరనుంది.


ఐఐటీ, ఐసర్‌ కోసం కోసం కేంద్రం నిధులు కేటాయించింది. ఐసర్‌కు రూ.1462 కోట్లు, ఐఐటీలకు రూ.9361 కోట్లు కేటాయించింది. తిరుపతిలో ఈ రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. వీటికి అవసరమైన నిధులు రాబట్టుకుంటే మిగిలిన మౌలిక వసతులతోపాటు పరిశోధనలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చు.


సొంతింటి కల తీరేలా..

గూడూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7.98 లక్షల కుటుంబాలు ఉండగా.. 8.18 శాతం మందికి సొంతిల్లు లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరిట 7,294 ఇళ్లు మంజూరు కాగా 1,711 పూర్తయ్యాయి.  ప్రస్తుత కేటాయింపుల్లో నిధులు పెరగడంతో ఎక్కువమందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.


5.5లక్షల మందికి ఊరట

ఆదాయ పన్ను చెల్లింపుల్లో మినహాయింపులతో ఉమ్మడి జిల్లాలో సుమారు 5.5 లక్షల మందికి ఊరట కలగనుంది. జిల్లాలో  పన్ను చెల్లింపు దారులు 5.5 లక్షల మంది ఉండగా.. వీరిలో రూ.3-4 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 2.75 లక్షలు, రూ.4-5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 1.65 లక్షల మంది, 5-7 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 1.10 లక్షల మంది ఉన్నారు.


రుణాల మినహాయింపులేవీ?

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను విధానంతో ఉద్యోగులకు ఎలాంటి ఊరట లేదు. కొత్త విధానంలో హెచ్‌ఆర్‌ఏ, గృహ రుణాల మినహాయింపులు ఉండవు.

కేశవులు, అధ్యక్షుడు, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం


మార్పులు లేవు

బడ్జెట్లో ఊహించినంతగా మార్పులు లేవు.  కొత్త పన్ను విధానం ద్వారా ఆదాయ పన్ను చెల్లింపులో శ్లాబుల్ని కుదించడంతో పాటు.. రూ.7లక్షల వరకు రాయితీ కల్పించడం ఆహ్వానించదగ్గ అంశం. వేతన జీవులు, వ్యాపారులకు ఊరట కలిగిస్తోంది.

 కె.ఉమామహేశ్వర్‌, జిల్లా అధ్యక్షుడు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌


వ్యవ‘సాయం’ లేదు

కేంద్ర బడ్జెట్‌లో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే ప్రకటన లేదు.  రాయలసీమ లోని పేద రైతులకు కేటాయింపులు లేకపోవడం దారుణం. రైల్వే బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారు.

రాజరత్నం, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని