logo

మోక్షమార్గం.. కీర్తనకు గాత్రం

తెలిసిన వారికి తెరువిదే మరిలేదు.. నలినాక్షు పొగడెడి నామములో నున్నది’ అంటూ సుప్రసిద్ధ గాయని వాణీజయరాం మూడు దశాబ్దాల క్రితం ఆలపించిన తాళ్లపాక పెద తిరుమలాచార్య సంకీర్త నేటికీ ఆధ్యాత్మిక సమాజాన్ని ఆకట్టుకుంటోంది.

Published : 05 Feb 2023 01:56 IST

వాణీజయరాంకు తిరుపతితో అనుబంధం

తిరుపతిలోని మహతిలో 2017లో జరిగిన మహిళా దినోత్సవంలో వాణీ జయరాంను సత్కరిస్తున్న నిర్వాహకులు

తిరుపతి(సాంస్కృతికం), శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ‘తెలిసిన వారికి తెరువిదే మరిలేదు.. నలినాక్షు పొగడెడి నామములో నున్నది’ అంటూ సుప్రసిద్ధ గాయని వాణీజయరాం మూడు దశాబ్దాల క్రితం ఆలపించిన తాళ్లపాక పెద తిరుమలాచార్య సంకీర్త నేటికీ ఆధ్యాత్మిక సమాజాన్ని ఆకట్టుకుంటోంది. కీర్తనను పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ మానవాళిలో భక్తిచైతన్యం నింపే ప్రయత్నం కూడా చేశారు. ‘మోక్షమనేది ఆకాశంలో లేదు! పాతాళంలోనూ లేదు! భూలోకంలో ఉన్నదా అంటే అదీ నిజంకాదు! అసలుసిసలైన మోక్షం హరినామ స్మరణలోనే ఉన్నదంటూ.. మోక్షమార్గాన్ని తెలియజేసే క్రమంలో సంకీర్తనకు తనగాత్రం ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించారు. వాణీజయరాంకు తిరుమల, తిరుపతితో అనుబంధం ఉంది. అన్నమయ్య కీర్తనలు ఆలపించడమే కాదు.. పలు సందర్భాల్లోనూ ఆమె తిరుపతిని సందర్శించారు.

2017లో ఘన సత్కారం

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 2017లో తితిదే నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి వాణీజయరాం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సభలో ఆమె మాట్లాడుతూ.. హిందూధర్మం.. స్త్రీకి పూజనీయమైన స్థానాన్ని కల్పించి గౌరవించిందన్నారు. అన్నిరంగాల్లోనూ రాణించగల సమర్థులు స్త్రీలు అని, వారిని గౌరవించి ప్రోత్సహించే సనాతన సంప్రదాయం హిందూ ధర్మంలో ఉందని.. ఆ సంప్రదాయాలకు తితిదే పెద్దపీట వేస్తోందని తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆమె మృతికి అన్నమాచార్య ప్రాజెక్టు మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ మేడసాని మోహన్‌, సప్తగిరి మాసపత్రిక పూర్వ సంపాదకులు సి.శైలకుమార్‌ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో..

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గాయని వాణీజయరాం తనదైన గాత్రంతో ఆహుతులను రంజింపచేశారు. 2014లో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆమె గాత్రకచేరీలో పాల్గొన్నారు. తొలుత శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. అప్పట్లో ఆమె పాటలు వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని