logo

పోరాడతాం.. సాధిస్తాం

యువతలో క్రీడలపై ఆసక్తి, అభిరుచి పెంపొందించి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహిస్తోంది.. మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో జరిగే ఐదో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఖోఖో జట్టు ఎంపికైంది.

Published : 06 Feb 2023 02:32 IST

ఖేలో ఇండియాకు ఖోఖో క్రీడాకారులు
న్యూస్‌టుడే, చిత్తూరు(క్రీడలు)

ఖోఖో ఆడుతూ (పాత చిత్రం)

యువతలో క్రీడలపై ఆసక్తి, అభిరుచి పెంపొందించి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహిస్తోంది.. మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో జరిగే ఐదో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఖోఖో జట్టు ఎంపికైంది.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో రాణిస్తున్నారు.. ఇప్పటికే పలు పోటీల్లో పతకాలు చేజిక్కించుకున్నారు.. తాజాగా చిత్తూరులోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో పది రోజుల పాటు శిక్షణ తీసుకున్న వీరు ఏపీని జాతీయ స్థాయి విజేతగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


చాలా ఆనందంగా ఉంది..

- ప్రవీణ్‌, శ్రీకాకుళం జిల్లా(ఆల్‌ రౌండర్‌)

నేను శ్రీకాకుళంలోని జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ నేపథ్య కుటుంబం మాది. గతంలో పలుమార్లు జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. నిష్ణాతులైన కోచ్‌ల ఆధ్వర్యంలో మెలకువలు నేర్చుకోవడం, రోజూ సాధనం చేయడం నాకు చాలా ఉపకరిస్తోంది. జాతీయ స్థాయిలో పాల్గొంటుండటం గొప్ప అనుభూతి.


తల్లిదండ్రుల ప్రోత్సాహం

- ఫణికుమార్‌, ప్రకాశం జిల్లా

ఇప్పటివరకు ఎనిమిది సార్లు జాతీయ స్థాయి పోటీల్లో తలపడ్డా. ప్రస్తుతం తొమ్మిదో సారి పాల్గొనడం మరపురాని అవకాశం. తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. డీఎస్‌ఏ మైదానంలో చక్కటి శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షకుల నుంచి నేర్చుకున్న మెలకువలతో ఆటలో సత్తా చాటగల్గుతున్నా. ఈ శిక్షణలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఎట్టిపరిస్థితుల్లో పతకం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉంది.


శిక్షణ బాగుంది..

- వంశీ, రుద్రవరం(ఆల్‌రౌండర్‌)

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కి ఎంపిక కావడం ఇది మూడోసారి. చిత్తూరులోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఇచ్చిన శిక్షణ ఎంతో బాగుంది. పదిరోజులు చక్కగా నేర్చుకున్నా. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చా. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నా. ఖోఖో క్రీడ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం నా జీవిత లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని