logo

మార్కెట్‌ కమిటీ.. లేదు పోటీ

పంట ఉత్పత్తుల మార్కెట్‌ పన్ను వసూళ్లలో పలమనేరు మార్కెట్‌ కమిటీ అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలోనే కాకుండా రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనే అత్యధికంగా వసూలు చేసినట్లు జిల్లా అగ్రి ట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ అధికారి పరమేశ్వరన్‌ ప్రకటించారు.

Published : 06 Feb 2023 02:32 IST

రాయలసీమలోనే పలమనేరుకు అగ్రస్థానం

పలమనేరు, న్యూస్‌టుడే: పంట ఉత్పత్తుల మార్కెట్‌ పన్ను వసూళ్లలో పలమనేరు మార్కెట్‌ కమిటీ అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలోనే కాకుండా రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనే అత్యధికంగా వసూలు చేసినట్లు జిల్లా అగ్రి ట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ అధికారి పరమేశ్వరన్‌ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 10 మార్కెట్‌ కమిటీలు ఉంటే ఏటా ప్రభుత్వం వీరికి వసూళ్ల విషయంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. దాన్ని దాదాపు పూర్తి చేయడం గమనార్హం. మొత్తం జిల్లాలోని అన్ని మార్కెట్‌ కమిటీల నుంచి రూ.7.30 కోట్ల ఆదాయం వస్తే.. ఇక్కడి నుంచి రూ.2.14 కోట్లు ఆదాయం సమకూరింది.

ఎలా సాధ్యమైంది..?

సాధారణంగా ప్రభుత్వం రైతులు పండించిన 240 రకాల పంటల విక్రయాలకు సంబంధించి పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందులోంచి పండ్లను కొన్నింటిని డినోటిఫైడ్‌ చేసింది. మిగిలిన ఉత్పత్తుల విక్రయాలను కట్టుదిట్టంగా మార్కెట్‌ కమిటీ పరిశీలించింది. పలమనేరు మార్కెట్‌ కమిటీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రంలోకి ఉత్పత్తులు రవాణా చేస్తుంటారు. గతంలో ఇక్కడ చెక్‌పోస్టులు ఉన్నా.. సిబ్బంది చేతివాటం కారణంగా పెద్దగా వసూళ్లు వచ్చేవి కావు. ఎక్కువగా బియ్యం, రాగులు, బెల్లం వంటి 10 రకాల ఉత్పత్తుల నుంచి మార్కెట్‌ కమిటీ ఫీజు వసూలు చేయాలి. అయితే చెక్‌పోస్టులు ఉన్నా మామూళ్లకు అలవాటు పడి గతంలో పెద్దగా వసూళ్లు చేసేవారు కారు. దాంతో అప్పట్లో ఏడాదికి రూ.కోటికి మించేది కాదు. అలాంటిది ఈ సంవత్సరం మాత్రం అత్యధిక వసూళ్లు సాధించడంతో అధికారులు అభినందిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఒక్క ఆళ్లకుప్పం చెక్‌పోస్టు నుంచి మాత్రమే రూ.కోటి వరకూ పన్ను వసూలైంది. అంతేకాకుండా పెద్దపంజాణి మండల పరిధిలో మొక్కజొన్న పిండి తయారు చేసే పరిశ్రమ నుంచి చాలా కాలంగా మార్కెట్‌ ఫీజు వసూలు చేసేవారు కారు. అలాంటిది ఈసారి వారి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారు. దాంతో కమిటీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలిగింది.


లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

- సంజీవకుమార్‌, కార్యదర్శి, మార్కెట్‌ కమిటీ పలమనేరు

ప్రభుత్వం మాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.65 కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.2.14 కోట్లు వసూలు చేయగా ఈ నెలాఖరుకు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. చెక్‌పోస్టులను బలోపేతం చేయడమే కాకుండా కొన్ని పరిశ్రమల నుంచి ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు కూడా వసూలు చేస్తున్నాం. సరిహద్దులో నిఘా పెట్టడం వలన కూడా లక్ష్యసాధన సాధ్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు