logo

అంచనాలతో సరి!

మాండౌస్‌ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. కేవలం విత్తనాలే ఇచ్చింది.

Published : 06 Feb 2023 02:32 IST

మాండౌస్‌ తుపాను బాధిత రైతులకు అందని సాయం
ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, సూళ్లూరుపేట, కోట

మాండౌస్‌ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. కేవలం విత్తనాలే ఇచ్చింది.

పుదూరులో నీటమునిగిన వరిపైరు (పాతచిత్రం)

తుపాన్ల కారణంగా జిల్లాకు చెందిన రైతులు ఏటా నష్టపోతున్నారు. గత ఏడాది డిసెంబరులో వచ్చిన మాండౌస్‌ తుపాను కారణంగా జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు మండలాల పరిధిలో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మిరప, మినుము పంటలకు నష్టం అధికంగా ఉంది. అధికారుల లెక్కల ప్రకారం 33 శాతంపైగా వరిలో నష్టపోయిన రైతులు సుమారు 495 మందికి చెందిన సుమారు 287.44 హెక్టార్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 33 శాతానికి పైగా ఇసుక మేటలు వేసిన పంట 27.3 హెక్టార్లు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇంతకంటే ఎక్కువ నష్టం జరిగినట్లు అన్నదాతలు తెలిపారు. వరితోపాటు మిరప రైతులు భారీగా నష్టపోయారు. పంట నష్టం అంచనాలు  అధికారులు క్షేత్రస్థాయిలో సక్రమంగా గుర్తించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏదీ పరిహారం?.. వరి సాగుచేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విత్తనాలు అందించింది. వరిపైరు ఏపుగా పెరుగుతున్న సమయంలో తుపానుతో నేలకొరిగిందని చెబుతున్నారు. విత్తనాల కొనుగోలుతోపాటు కూలీలకు, దుక్కిదున్నేందుకు పెట్టిన పెట్టుబడి మొత్తం నీటిపాలైందని అంటున్నారు. అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం 33శాతానికిపైగా పంట నష్టం జరిగిన దానికి సైతం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు.


రూపాయి ఇవ్వలేదు

- తెరే రమణయ్య, మన్నారుపోలూరు 


 

నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశా. డిసెంబరులో వచ్చిన వరదలతో మొత్తం మునిగిపోయింది. వెన్ను దశలో ఉండగా పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. అప్పట్లో వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి వెళ్లారు. ఎలాంటి పరిహారం అందలేదు. అప్పులు చేసి పంట సాగుచేశా. 


విత్తనాలే ఇచ్చారు

-హరిప్రసాద్‌రెడ్డి, కోట

ఉన్న 8 ఎకరాల్లో వరినాట్లు వేశా. నారు పూర్తిగా ముంపునకు గురైంది. మందులు, దుక్కి దున్నేందుకు వేల రూపాయలు ఖర్చయింది. ప్రభుత్వం కేవలం విత్తనాలే ఇచ్చింది. ఇప్పటివరకు పంట నష్టానికి ఎటువంటి పరిహారం అందలేదు.  


రెండుసార్లు నష్టపోయా

- రాంబాబు, కోట

నాకు 7 ఎకరాల పొలం ఉంది. రెండుసార్లు నారు పోసినా వర్షాల వల్ల మొత్తం దెబ్బతింది. అధికారులు విత్తనాలే ఇచ్చారు. పంట నష్టానికి ఎటువంటి పరిహారం దక్కలేదు. మళ్లీ కొత్తగా నారు పోసి పంటను కాపాడుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది.


పొలాల్లో ఇసుక మేటలు..

- ఎ.చంద్రశేఖర్‌, మన్నారుపోలూరు

రెండెకరాల పొలం ఉంది. నవంబరులో వరి సాగుచేయగా డిసెంబరులో వచ్చిన వర్షాలకు పూర్తిగా దెబ్బతినింది. వెన్ను దశలో వరద ముంచెత్తింది. ఇసుక మేటలు వేశాయి. కొంత పంట కొట్టుకుపోయింది. అధికారులు పరిశీలించి ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని