logo

నేర వార్తలు

తెదేపా సీనియర్‌ నాయకుడు, తిరుపతి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కందాటి శంకర్‌రెడ్డి(72) ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 06 Feb 2023 02:32 IST

తిరుపతి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కందాటి శంకర్‌రెడ్డి మృతి

కందాటి శంకర్‌రెడ్డి (పాతచిత్రం)

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నాయకుడు, తిరుపతి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కందాటి శంకర్‌రెడ్డి(72) ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు 25 రోజుల క్రితం ఆయన గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా శంకర్‌రెడ్డి గుర్తింపు పొందారు. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్‌లో ఉండడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. తరువాత చంద్రబాబు ఆశీస్సులతో 2002లో తిరుపతి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిపై తెదేపా అభ్యర్థిగా శంకర్‌రెడ్డి విజయం సాధించి మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యారు. 2004లో శాసనసభ ఎన్నికల్లో పుత్తూరు నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చిరంజీవి, కాంగ్రెస్‌ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిపై తెదేపా అభ్యర్థిగా శంకర్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన గత ఎన్నికల సమయంలో తిరుపతి తెదేపా అభ్యర్థి సుగుణమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని శంకర్‌రెడ్డి నివాసంలో పార్థివదేహానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం, తెదేపా నాయకులు నరసింహయాదవ్‌, ఆర్సీ మునికృష్ణ, జేడబ్ల్యూ విజయకుమార్‌, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

కలచివేసింది: చంద్రబాబు

శంకర్‌రెడ్డి మృతి తనను కలిచివేసిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ స్థాయి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదన్నారు. తిరుపతి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కందాటి తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను చరవాణిలో పరామర్శించి ఓదార్చారు.


టిప్పర్‌ని ఢీకొని ఇద్దరి దుర్మరణం

ప్రమాద స్థలంలో మృతులు, క్షతగాత్రుడు

పెళ్లకూరు, న్యూస్‌టుడే : మండలంలోని టెంకాయతోపు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న టిప్పర్‌ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. నాయుడుపేట నుంచి తిరుపతి వైపు వెళ్తున్న టిప్పర్‌ టెంకాయతోపు దగ్గర ఒక్కసారిగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి బయటకు తీయగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు కాగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ఈ సమయంలో ఇక్కడ ట్రాఫిక్‌ కొద్ది సమయం ఆగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హర్షవర్దన్‌రెడ్డి (28), పుత్తూరుకు చెందిన ధరయ్య (25)గా గుర్తించారు. క్షతగాత్రుడు పీలేరుకు చెందిన అజయ్‌గా గుర్తించారు. వీరంతా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు కాగా ఆదివారం పార్టీ కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.


పోలీసుల అదుపులో నలుగురు?

బంగారుపాళ్యం: నారా లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యం నాలుగురోడ్ల కూడలిలో గంగవరం సీఐ అశోక్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బందిపై తెదేపా నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేశారని పోలీసులు కేసు నమోదు చేసి విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సీఐ నరసింహారెడ్డిని సంప్రదించగా తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.  


అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

శ్రీరంగరాజపురం, న్యూస్‌టుడే: అనుమానాస్పదస్థితిలో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన రైతు మునస్వామిరెడ్డి (65) ఆదివారం సాయంత్రం ఆవుకు మేత తీసుకురావడానికి పొలం వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలంవద్దకు వెళ్లి చూడగా మునస్వామిరెడ్డి బలమైన గాయంతో విగత జీవిగా పడి ఉన్నాడు. గ్రామస్థుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్‌షావలి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తలకు బలమైన గాయం తగిలి మృతిచెందినట్లు గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పంచనామా నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి ఎస్సై తరలించామన్నారు.


అమ్మవారి ఆలయ ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయ ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ దామోదరంను ఆదివారం వేకువజామున పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 26న అమ్మవారి కల్యాణోత్సవం మండపంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ శేషాద్రిపై మ్యాన్‌పాక్‌తో దామోదరం దాడి చేసిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు ఆయనపై  పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు