logo

ఆలకిస్తూ.. ధైర్యాన్నిస్తూ...

చాలీచాలని కూలితో డొక్కాడని కార్మికుల ఆవేదన.. అర్హులైనా సంక్షేమానికి దూరమైన పేదల ఆక్రందన.. ఉద్యోగాలు రాక జీవితాల్ని కోల్పోతున్నామని వేదనకు గురవుతున్న యువత..

Updated : 07 Feb 2023 02:57 IST

యువగళం.. చైతన్య మార్గం
ఉత్సాహంగా నారా లోకేశ్‌ పాదయాత్ర

పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

చాలీచాలని కూలితో డొక్కాడని కార్మికుల ఆవేదన.. అర్హులైనా సంక్షేమానికి దూరమైన పేదల ఆక్రందన.. ఉద్యోగాలు రాక జీవితాల్ని కోల్పోతున్నామని వేదనకు గురవుతున్న యువత.. ఇలా పలు వర్గాల సమస్యల్ని సావధానంగా ఆలకిస్తూ.. భవిష్యత్తులో అందరికీ న్యాయం చేస్తామని ధైర్యాన్నిస్తూ.. ప్రజల అడుగులో అడుగులేస్తూ.. యువగళం పాదయాత్రను చైతన్య యాత్రగా మలిచారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. చిత్తూరు నగర వీధుల్లో ఆద్యంతం యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది.. అభిమానులు పలుచోట్ల పెద్దఎత్తున పూల వర్షం కురిపించారు.. గజమాలతో సత్కరించారు.. విద్యార్థుల కేరింతలు పాదయాత్రకు మరింత ఉత్సాహాన్ని నింపాయి.

న్యూస్‌టుడే, చిత్తూరు సంతపేట, మిట్టూరు, కొంగారెడ్డిపల్లె, జిల్లా పంచాయతీ, జడ్పీ


జాబ్‌ క్యాలెండర్‌ లేదు..  ఖాళీల భర్తీ కరవు

వినతి: జాబ్‌ క్యాలెండర్‌ను అమలు చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసింది. పలు శాఖల్లో రెండు లక్షల ఖాళీలు ఉన్నా భర్తీకి చర్యలు చేపట్టడం లేదు. సన్నద్ధతకు తక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌ పోటీ పరీక్షల్లో చాలామంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కటాఫ్‌ మార్కులు తగ్గిస్తే నిరుద్యోగులకు అవకాశం కల్పించినట్లవుతుంది.

సిద్ధిక్‌,  నరసింహ, భాస్కర్‌, రాష్ట్ర నిరుద్యోగ ఐకాస నాయకులు

లోకేశ్‌ హామీ: వినతిని పరిశీలించి నిరుద్యోగులకు అండగా ఉంటాం.


సంపాదనలో సగం ఆస్పత్రి ఖర్చులకే..

బీడీ కార్మికులు

వినతి: సార్‌.. మేమంతా బీడీ కార్మికులం. ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు బీడీలు చుడితే వచ్చే ఆదాయం రూ.180 నుంచి రూ.220 మాత్రమే.  రక్తహీనత, క్యాన్సర్‌, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నాం.  ఆదాయంలో సగం ఆస్పత్రి ఖర్చులకే దారపోస్తున్నాం.  కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు కావడం లేదు.

బీడీ కార్మికులు, లెనిన్‌నగర్‌, చిత్తూరు

లోకేశ్‌ హామీ: వెట్టి చాకిరీకి గురవుతున్న కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేసి అండగా నిలుస్తాం. పక్కాగృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.


‘జగన్‌ మోసం చేశారు’

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారని, జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితిలో ఉన్నామని స్థానిక గాంధీ రోడ్డులోని విద్యుత్తు శాఖ కార్యాలయం ఎదుట ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు లోకేశ్‌ వద్ద వాపోయారు.


‘న్యాయవ్యవస్థపై వైకాపా ప్రభుత్వం కక్షగట్టింది’

లోకేశ్‌కు న్యాయదేవత విగ్రహాన్ని బహూకరిస్తున్న న్యాయ వాదులు

చిత్తూరు లీగల్‌, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయవ్యవస్థపై కక్షగట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం చిత్తూరులోని పాత జిల్లా కోర్టు ఎదుట తెదేపా లీగల్‌సెల్‌ చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రతినిధులు, న్యాయవాదులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతో కలిసి న్యాయవాదులు గాంధీ కూడలి వరకు నడిచారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేంద్ర కుమార్‌, అశోక్‌ ఆనంద్‌యాదవ్‌, చంద్రశేఖర్‌, రామకృష్ణ, శంకర్‌నాయుడు, వసంతకుమార్‌, జ్యోతిరామ్‌, రాజేంద్ర న్యాయవాదులు పాల్గొన్నారు.


వెయ్యి అడుగుల ఇల్లుందని సీఎంకి ఎలా కనిపించిందో?

‘బాబూ.. నాకు మీ నాయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పింఛను వచ్చింది. ఆయన తర్వాత రాజశేఖర్‌రెడ్డి, ఇంకా పలువురు సీఎంలు మారారు. వాళ్లెవరూ నాకు వెయ్యి అడుగుల ఇల్లుందని పింఛను తీసేయలేదు. ఈ సీఎంకే ఎలా కనిపించిందో అర్థం కావడం లేదు. నిజంగా వెయ్యి అడుగుల ఇల్లుంటే పెద్ద బిల్డింగ్‌ కట్టుకుని.. బాడుగకు ఇచ్చి ఆ డబ్బుతో దర్జాగా జీవిస్తా’ అని   చిత్తూరు వెంగళరావు కాలనీకి చెందిన గౌరమ్మ.. నారా లోకేశ్‌కు తెలిపారు. ‘ఇన్నేళ్లు వచ్చిన పింఛన్‌ను ఇప్పుడే ఎందుకు రద్దు చేశారు. కొత్తవి ఇవ్వడానికి, పెంచిన మొత్తాన్ని ఇవ్వడం కోసం నెలనెలా సీఎం ఇలా అర్హులైనవారి పింఛన్లు రద్దు చేస్తున్నాడు. వెయ్యి అడుగుల స్థలాన్ని సర్వే చేసి చూపాలని సచివాలయ సిబ్బందిని అడుగు. ఎందుకు రద్దుచేశారని ప్రశ్నించు’ అని లోకేశ్‌ సూచించారు.


అడుగడుగునా పోలీసులు

యువగళం పాదయాత్రలో అడుగడుగునా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మంగసముద్రంలోని విడిది కేంద్రం నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభం కాగా అక్కడి నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూశారు. సంతపేట, హైరోడ్డులో వన్‌-వే అమలు చేశారు. అభిమానులు సెల్ఫీలు తీసుకోవాలన్నా, హారతి ఇవ్వాలన్నా, గజమాలలు వేయాలన్నా రోడ్డుకు ఎడమవైపుగానే నిర్వహించేలా చేశారు. గాంధీ విగ్రహ కూడలి, పీసీఆర్‌ కళాశాల వద్ద ప్రజలు, విద్యార్థులు భారీగా మోహరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాదయాత్ర వెంట సాగారు.


8 చదరపు అడుగులు ఎక్కువని పింఛను తొలగించారు..

మా మామ వయసు 80 ఏళ్లు. ఆయనకు ఏన్నో ఏళ్లుగా పింఛను వస్తోంది. అయితే రెండు నెలలుగా ఇవ్వకుండా నిలిపేశారు. అదేమని అడిగితే ఎనిమిది చదరపు అడుగుల స్థలం ఎక్కువ ఉందని చెబుతున్నారు. అందుకే రద్దు చేశారట. ఆస్తి పన్ను పెంచేశారు. డబ్బులు కట్టలేక అవస్థలు పడుతున్నాం.

సుజాత, 14 డివిజన్‌, చిత్తూరు


రాజధాని ఏదని అడిగితే చెప్పలేకపోతున్నా

నా కూతురు రెండో తరగతి చదువుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చకచకా చెప్పేస్తుంది.  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏమిటని నన్ను అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా? రాష్ట్రంలో జాబ్‌ క్యాలెండర్‌ సరిగా అమలు కావడం లేదు. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన 40 రోజుల్లో పరీక్ష పెట్టారు. సన్నద్ధత లేక చాలామంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. 

పవన, చిత్తూరు


ఒంటరి మహిళకు కార్డు ఇవ్వరట

నేను ఒంటరి మహిళను.  అందుకని రేషన్‌ కార్డు ఇవ్వడం కుదరదు అంటున్నారు. బాడుగ ఇంట్లో ఉంటున్నా. నాలుగు ఇళ్లలో పనిచేస్తేనే  కడుపు నిండా అన్నం తినగల్గుతున్నా. పనులు చేసే శక్తి తగ్గుతోంది. రేషన్‌ కార్డు, సంక్షేమ పథకాల లబ్ధి కల్గించాలని  కోరుతున్నా.  

శాంత, వైఎస్‌ఆర్‌ కాలనీ, చిత్తూరు


నాపై రౌడీషీట్‌ తెరిచారు..

నేను ఎస్సీల సమస్యలపై పోరాడుతున్నందుకు  ప్రభుత్వం నాపై 11 కేసుల్ని పెట్టించింది. నాపై రౌడీషీట్‌ తెరిచారు. నెల రోజులు ఊరి నుంచి బయటకు పంపించారు. ప్రతి ఆదివారం స్టేషన్‌లో సంతకం పెడుతున్నా.. ఎస్సీలతో  ముఖాముఖి వేదికగా విన్నవిస్తున్నా.

సుబ్బరాజు, పోటుకనుమ, పూతలపట్టు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని