logo

అంచనా లేని సంచలనం

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తెదేపాకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి.

Published : 19 Mar 2023 03:33 IST

ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి
తెదేపాకు పట్టం కట్టిన పట్టభద్రుల ఓటర్లు

క్యూలైన్‌లో విద్యావంతులు (పాతచిత్రం)

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తెదేపాకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లో 36 నియోజకవర్గాలు ఉండగా.. ప్రకాశంలో నాలుగు స్థానాల్లో, చిత్తూరులో ఒక స్థానంలో మాత్రమే తెదేపా గెలిచింది. సరిగ్గా నాలుగేళ్లు తిరగకముందే అవే స్థానాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా జోరు పెంచింది. అంచనా లేకుండా సంచలన విజయంతో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్‌ శనివారం ఉదయం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌ చేతులమీదుగా డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు. పట్టభద్రులు అధికార పార్టీ దౌర్జన్యాలు, దాడులు, ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటుతో మంచి నిర్ణయం తీసుకున్నారని తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఉపాధి లేక వలస బాట..

ప్రస్తుత అంచనా ప్రకారం జిల్లాలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. చదువు కున్నవారు 18 లక్షల వరకు ఉంటారు. పట్టభద్రులైన వారిలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మిగిలినవారు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఏటా 40 వేల మంది పట్టాలు చేతపట్టుకుని వస్తుంటారు. ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు జిల్లాలో లేవు. కార్పొరేషన్ల ద్వారా సయం ఉపాధి పథకాలు లేవు. సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లు తప్ప ఇతర పోస్టుల భర్తీ అంతంతే. జాబ్‌ క్యాలెండర్‌ కానరాలేదు. విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించాల్సిన పరిస్థితి.

అధికారాన్ని ప్రయోగించినా..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అన్ని శక్తులూ ఒడ్డాయి. వివిధ ప్రాంతాల్లో బోగస్‌ ఓట్లు వెలుగు చూడటం కలకలం రేపింది. అనర్హులకు ఓటుహక్కు వచ్చిన ప్పుడు సంబంధిత సిబ్బంది ఏం చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యా యి. కొన్నిచోట్ల వాలంటీర్లు, గృహ సారథుల ద్వారా ఓటుకు నగదు పంపిణీ జరిగిందన్న ఆరోపణ లు వచ్చాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద విపక్షా లకు ఒకలా, అధికార పార్టీకి మరోలా నియామవళి అమలుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలాంటి ప్రతి కూల పరిస్థితు ల్లో ఓటర్లు తమ విజ్ఞత చూపారన్న చర్చ నడుస్తోంది.

దౌర్జన్యాలు, కేసులతో విసిగి..

అవినీతి, అక్రమాలు, ధరల పెరుగదలపై ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజం. ఇంధన, నిత్యావసరాల ధరలు పెరిగినా, ఇచ్చిన హామీలు నేరవేర్చకపోయినా ప్రశ్నించే స్వేచ్ఛ లేని పరిస్థితి నెలకొందని యువత వాపోయారు. న్యాయ మైన కోర్కెలు తీర్చమని అడిగినా, ప్రశ్నించినా వేధింపులు, కేసులు, అరెస్టులు సాధారణ మవడంతో విద్యావంతులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో తమ ఆయుధమైన ఓటుతో వారి వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

కొత్త పరిశ్రమలు లేవు..

చిత్తూరు జిల్లాలో కొత్తగా ఎక్కడా నూతన పారిశ్రామికవాడలు ఏర్పాటు కాలేదు. కొత్త పరిశ్రమలు అంతంతమాత్రమే. ఉన్నవి తరలిపోతున్న పరిస్థితి. విద్యుత్‌ ఛార్జీల భారం, ఇతర పన్నులతో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఔత్సాహికులు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేందుకు సాహసం చేయడం లేదు. దీంతో యువతకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి.

పోలింగ్‌లో భారీగా పాల్గొని..

పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3.81 లక్షల మంది ఓటుహక్కు పొందగా చిత్తూరు జిల్లాలోనే 54,152 మంది ఓటర్లుండగా 79.70 శాతం మంది తమ హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి జిల్లాలో 85,570 మంది ఓటర్లుండగా 71 శాతం మంది సద్వినియోగం చేసుకున్నారు. చిత్తూరులో 75 శాతం, పలమనేరులో 72, తిరుపతిలో 70, శ్రీకాళహస్తిలో 74 శాతం మంది ఓటేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుంచి వచ్చి పోలింగ్‌ రోజు సాయంత్రం వరకు పెద్దసంఖ్యలో క్యూలో నిల్చొని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు విద్యావంతులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని