logo

సార్‌.. పాఠం వినేదెలా..?

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలని ప్రభుత్వం బైజూస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఆ తరగతి బోధించే ఉపాధ్యా యులకు ట్యాబ్‌లు అందజేసింది..

Published : 19 Mar 2023 03:33 IST

పనిచేయని ట్యాబ్‌లు
టీచర్లకు తప్పని తిప్పలు
విద్యార్థులకు బోధన ప్రశ్నార్థకం
న్యూస్‌టుడే, చిత్తూరు, తిరుపతి విద్య

ట్యాబ్‌లకు మరమ్మతు చేస్తున్న సాంకేతిక సిబ్బంది(పాత చిత్రం)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలని ప్రభుత్వం బైజూస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఆ తరగతి బోధించే ఉపాధ్యా యులకు ట్యాబ్‌లు అందజేసింది.. రెండు నెలల కిందట అందజేసిన ఈ ట్యాబ్‌లు ప్రస్తుతం పూర్తిగా మొరాయిస్తున్నాయి.. పంపిణీ చేసిన రోజు నుంచి పలుచోట్ల పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.. సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఆన్‌లైన్‌ ద్వారా బాగుచేయిస్తున్నారు.. జిల్లాల వారీగా ఏ పాఠశాల్లో విద్యార్థులు ఎన్ని గంటలు ట్యాబ్‌ను వినియోగిస్తున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు నిత్యం తెలుసుకుంటూ బాగా వెనుకబడిన జిల్లాల అధికారులతో మాట్లాడుతున్నారు.

ఇవీ లోపాలు..

చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 477 ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులు 18,251మంది, ఉపాధ్యాయులు 2,772మంది ఉన్నారు. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో 433 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 18,723మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు, 2,593మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరికీ ట్యాబ్‌ల పంపిణీ జరిగింది.ఆపై గత జనవరిలో ఉమ్మడి జిల్లాలో 620 సిమ్‌ కార్డులు పనిచేయలేదు. వీటిని సాంకేతిక సిబ్బంది వచ్చి మరమ్మతు చేశారు. సబ్జెక్టు ఉపాధ్యాయుల్లో మొదట గణితం, సైన్స్‌, సోషల్‌, ఆంగ్ల సబ్జెక్టు బోధకులకు తర్వాత తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వీటిని ఎలా వినియోగించాలి, కంటెంట్‌ ఏ విధంగా అప్‌లోడ్‌ చేయాలి తదితర సమాచారాన్ని వీడియో రూపంలో రూపొందించి జిల్లా విద్యాశాఖ అన్ని పాఠశాలలకు అందజేసింది. పంపిణీ చేసిన మొదటి నుంచి పెద్దఎత్తున సాంకేతిక లోపాలు కన్పిస్తు న్నాయి. ఇంకా కొన్ని ట్యాబ్‌లు నేటికీ పనిచేయడం లేదు. పలుచోట్ల దెబ్బతిన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు ట్యాబ్‌ తెరిచేందుకు పాస్‌వర్డులు మరిచిపోతున్నారు. మరికొన్ని చోట్ల సర్వర్‌ సమస్య ఉంది. వినియోగించే విధానం ఎంత విశదీకరించినా అర్థం కావడం లేదని సమాచారం. ట్యాబ్‌లు బాగుచేయడం, విద్యార్థులు ఏ మేరకు ఏ కంటెంట్‌ చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారో ప్రతిరోజూ తెలుసుకుని రికార్డులో నమోదు చేసేందుకు ప్రత్యేక విభాగం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. పంపిణీ చేసిన ప్రారంభంలో సాంకేతిక సమస్యలు రావడంతో రాష్ట్ర కార్యాలయం నుంచి సాంకేతిక సిబ్బంది జిల్లాకు వచ్చి బాగు చేశారు. పలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వినియోగంపై వివరించారని డీఈవో విజయేంద్ర రావు తెలిపారు.

సిమ్‌ కార్డుల తొలగింపు..

విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందజేసిన ట్యాబ్‌లు పనిచేయకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. సిమ్‌ కార్డు ఉంటే విద్యార్థులు ఏమేం చూశారని అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో  అందులో ఉంచాల్సిన సిమ్‌ కార్డులను కొందరు విద్యార్థులు తీసేసి మళ్లీ అమర్చుతున్నారు. దీంతో అవికాస్తా పనిచేయడం లేదు. ఓసారి సిమ్‌ కార్డు తీసి అమర్చితే పనిచేయదని సాంకేతిక సిబ్బంది తెలియజేస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. మారుమూల పాఠశాలల్లో అంతర్జాలం సమస్యలు ఉన్నాయి. పైగా ఇచ్చిన ట్యాబుల్లో కొన్నింటిలో నాణ్యతా లోపాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ప్రైవేటు వ్యక్తుల చేత వీటికి మరమ్మతు చేయిస్తున్నారని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు