logo

దామినేడు..అక్రమాలు చూడు

తిరుపతి పద్మావతీపురానికి చెందిన బాలాజీకి దామినేడు పట్టణ గృహాలు బ్లాక్‌-22లోని జీ6 గృహాన్ని  అధికారులు కేటాయించారు.

Published : 21 Mar 2023 03:02 IST

ఖాళీ గృహాలు స్వాధీనం

ఆపై దొంగ పత్రాలతో విక్రయం

న్యూస్‌టుడే, తిరుపతి (నగరం)

దామినేడులోని పట్టణ గృహ సముదాయం

* తిరుపతి పద్మావతీపురానికి చెందిన బాలాజీకి దామినేడు పట్టణ గృహాలు బ్లాక్‌-22లోని జీ6 గృహాన్ని  అధికారులు కేటాయించారు. కొంతకాలంగా ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గ్రహించిన స్థానిక అధికార పార్టీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా మరో వ్యక్తికి విక్రయించారు. ఆలస్యంగా ఇంటి యజమాని వెళ్లి చూడగా పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ ఇంటిని కలుపుకొని గోడకట్టి ఉంది. బాధితుడు ప్రశ్నించగా.. కాలనీలోని ఓ నాయకురాలు, ఆమె అనుచరులు విక్రయించినట్లు చెప్పాడు. బాధితుడు ఆమెను నిలదీయగా బెదిరింపులకు దిగడం గమనార్హం. ఇలా 20 మంది లబ్ధిదారులకు తెలియకుండానే నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్రం నిధులతో తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద పట్టణ గృహ సముదాయాలు నిర్మించారు. ఒక్కొక్క బ్లాక్‌లో 24 కుటుంబాలు నివాసం ఉండేలా 83 బ్లాక్‌ను నిర్మించి... పది సంవత్సరాల క్రితం దశలవారీగా లబ్ధిదారులకు కేటాయించారు. దాదాపు రెండు వేల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. కొంత మంది లబ్ధిదారులు తమ ఇళ్లకు తాళాలు వేసి ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇలాంటి గృహాలపైన కొందరు అక్రమార్కుల కళ్లుపడ్డాయి. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసిన గృహాలనే లక్ష్యంగా చేసుకున్నారు.

* ఖాళీ ఇళ్లే లక్ష్యం

దామినేడు పట్టణ గృహాల్లో నూతనంగా నిర్మించిన సముదాయంలో చాలా వరకు ఇళ్లు లబ్ధిదారులు కేటాయించలేదు. స్థానిక నాయకులు కొందరు ఖాళీగా ఉన్న ఇళ్లను అధీనంలోకి తీసుకుని అధికారులకు తెలియకుండా అద్దెకు ఇచ్చి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు గృహాలను లబ్ధిదారుల నుంచి పక్క పక్కనే ఉన్న రెండు ఇళ్లను కొనుగోలు చేసి ఒకటిగా చేసి వాడుకుంటున్నారు. అనుమతులు లేకుండానే రెండు ఇళ్ల మధ్య గోడలను తొలగించి ఒకటి చేస్తున్నారు. అక్రమాలపై తిరుచానూరు పంచాయతీకి వరుస ఫిర్యాదులు అందాయి.
యజమానులకు తెలియకుండానే బయటి వ్యక్తులకు అమ్మిసొమ్ము చేసుకుంటున్నారు. ఇలా దాదాపు 20కి పైగా ఇళ్లను విక్రయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక గృహాల్లో నివాసం ఉంటున్న అధికార పార్టీకి చెందిన కొందరు గ్రూపులుగా ఏర్పడి ఖాళీ ఇళ్లను అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

దామినేడు పట్టణ గృహాల్లోని లబ్ధిదారులకు తెలియకుండా వాళ్ల ఇళ్లను ఎవరైనా విక్రయించినట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. గత ఏడాది ఆగస్టులో అన్ని గృహాల్లో  సిబ్బంది సర్వే చేసి పూర్తి వివరాలను నమోదు చేసుకున్నాం. ఖాళీ గృహాలను అక్రమంగా స్వాధీనం చేసుకుని అద్దెకు ఇవ్వడం నేరం. ఇలాంటి వాటిని నియంత్రిస్తాం.
 పులి లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి,  తిరుచానూరు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని