logo

హస్తకళ..ఉపాధి భళా

హస్తకళలకు కాణాచిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Published : 21 Mar 2023 03:02 IST

కళాకారులకు పెరుగుతున్న అవకాశాలు

డీఆర్‌డీఏ పర్యవేక్షణలో నడుస్తున్న కేంద్రం

హస్తకళలకు కాణాచిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో శ్రీకాళహస్తికి సమీపంలో ఏర్పాటు చేసిన హస్తకళ గ్రామం పేద, మధ్య తరగతి హస్తకళాకారులకు ఎంతో అండగా నిలుస్తోంది. కళాకారులు తయారు చేసే వస్తోత్పత్తులను కొనుగోలు చేయడం, ఇక్కడి హస్తకళ గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు సరసమైన ధరలతో అందుబాటులోనికి తీసుకురావడంతో సత్ఫలితాలను సాధిస్తూ ముందకెళ్తోంది.

అన్నీ.. అద్భుత కళాఖండాలే

హస్తకళాకారులు తయారు చేసే ఉత్పత్తులు.. అన్నీ అద్భుత కళాఖండాలే. ఇక్కడున్న బొమ్మలను చూసిన ఎవరైనా అబ్బురపడాల్సిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన హస్తకళ ఉత్పత్తులన్నీ ఇక్కడ అందుబాటులో ఉండటంవల్ల హస్తకళాకారులకు ఎంతో సౌలభ్యంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంతో ప్రాభవాన్ని సంతరించుకున్న హస్తకళలైన కలంకారీ, కొయ్యబొమ్మలు, టెర్రకోట, మట్టిబొమ్మలు, గుడ్డసంచులు, లక్కపిడత బొమ్మలు, దారపు గాజులు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసే అగర్‌బత్తీలు, చాపలే కాకుండా గిరిజన కార్పొరేషన్‌ అందుబాటులోనికి తీసుకువచ్చే స్వచ్ఛమైన తేనె ఇలా ఇవన్నీ ఇక్కడ పొందే అవకాశముంది.

ఆర్థికంగానూ పురోగతి

ఇక్కడి హస్తకళా కేంద్రం పరిధిలో 46 సంస్థలకు సంబంధించి దాదాపుగా 3500 మంది హస్తకళాకారులు ఉపాధిని పొందుతున్నారు. ఈ ఉత్పత్తులను కన్‌సైన్‌మెంట్‌ పద్ధతిలో కొనుగోలు చేస్తుంటారు. తీసుకున్న ఉత్పత్తులను విక్రయించాక కళాకారులకు హస్తకళా గ్రామం ద్వారా నగదు చెల్లింపు జరుగుతోంది. ఏటా రూ.25 లక్షలు నుంచి రూ.30 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తూ ఇక్కడి హస్తకళ గ్రామం పేద, మధ్య తరగతి కళాకారుల పాలిట వరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని