logo

మిగిలింది 10 రోజులే

జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రధాన రహదారుల్లో 20-25 చోట్ల తనిఖీ కేంద్రాలు ఉన్నాయి.

Published : 21 Mar 2023 03:54 IST

 జిల్లాలో 80 శాతం ప్రగతి
ఇదీ ఏఎంసీల ఆర్థిక లక్ష్యం

జిల్లా అగ్రి ట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ శాఖ కార్యాలయం

న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు) : జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రధాన రహదారుల్లో 20-25 చోట్ల తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) మార్కెటింగ్‌ శాఖ ఆదాయ లక్ష్యం రూ.10.62కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.8.44 కోట్లు వసూలు చేసి 80శాతం ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంది. గతేడాదితో పోలిస్తే.. ఈ సమయానికి ఈ ఏడాది రూ.1.44 కోట్లు అదనపు ఆదాయం వచ్చింది.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పంట ఉత్పత్తుల నుంచి సెస్‌ వసూలు ప్రధాన ఆర్థిక వనరు. జిల్లాలోని కొన్ని కమిటీలకు అధిక ఆదాయం సమకూరి ప్రగతిని సాధిస్తుండగా.. మరికొన్ని ఆదాయ వనరులు లేక చతికిలపడి చాలా వెనుకబడి వేతనాలు ఇచ్చేందుకే కష్టంగా మారింది.. ఈ ఆర్థిక సంవత్సరం పది రోజుల్లో ముగియనుంది.. ఈలోగా మార్కెటింగ్‌ శాఖ ఆర్థిక లక్ష్యం కష్టసాధ్యమే.

* పలమనేరు నుంచే 30 శాతం..

ఆదాయ లక్ష్య సాధనలో పలమనేరు మార్కెట్‌ కమిటీ అగ్రస్థానంలో ఉంది. జిల్లా మార్కెటింగ్‌ శాఖకు సమకూరిన ఆదాయంలో ఈ కమిటీ నుంచే 30శాతం ఆదాయం లభించడం విశేషం. ఈ కమిటీ రూ.2.65కోట్లు లక్ష్యానికి గాను.. రూ.2.61 కోట్లు ఆదాయం సమకూరగా.. చిత్తూరు కమిటీ రూ.2.15కోట్లకు గాను రూ.1.88కోట్లు, పుంగనూరు కమిటీ 1.60కోట్లకు గాను రూ.94.04 లక్షలు, బంగారుపాళ్యం కమిటీ రూ.1.12 కోట్లకు గాను రూ.75.18లక్షలు వచ్చాయి. నగరి కమిటీ రూ.60 లక్షలకు గాను రూ.89.66లక్షలు, సోమల కమిటీ రూ.15లక్షలకు గాను రూ.6.43లక్షలు, కుప్పం కమిటీ రూ.70లక్షలకు గాను రూ.57.39లక్షలు, పెనుమూరు కమిటీ రూ.1.05కోట్లకు గాను రూ.48.68లక్షలు, రొంపిచెర్ల కమిటీ రూ.25లక్షలకు గాను రూ.11.21 లక్షలు, ఎస్‌ఆర్‌పురం కమిటీ ఆదాయ లక్ష్యం రూ.35 లక్షల లక్ష్యానికి రూ.12.69లక్షల ఆదాయం సమకూరింది. పది కమిటీల్లో ఐదు కమిటీలు 50శాతం ఆర్థిక ప్రగతి సాధించక చాలా వెనుకబడి ఉన్నాయి.

* అన్నదాతకు నిలిచిన సేవలు..

రైతులకు గతంలో మార్కెట్‌ కమిటీల ద్వారా పలు సేవలు అందేవి. వైకాపా పాలనలో అన్నదాతకు అండగా ఉండాల్సిన కమిటీలు అన్నిరకాల సేవలకు దూరమయ్యాయి. వీటి పరిధిలో పశువుల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా చేపట్టే పశువైద్యసేవల నిర్వహణ ఊసేలేదు. ఆరుగాలం శ్రమంచి పండించిన ఉత్పత్తులకు మార్కెట్‌లో మద్దతు ధర లభించకపోతే గోదాముల్లో నిల్వ చేసుకుంటే రైతుబంధు ద్వారా రైతులకు రుణాలిచ్చేవారు. ప్రస్తుతం ఈ పథకానికి మంగళం పాడారు. పంట ఉత్పత్తుల రవాణాకు గ్రామాల్లో లింకురోడ్ల పునరుద్ధరణ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఇలా రైతులకు కమిటీల ద్వారా ప్రయోజనం శూన్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని