logo

టెక్స్‌టైల్‌ పార్క్‌కు రంగం సిద్ధం

రాష్ట్రంలో చేనేత తర్వాత మరమగ్గ పరిశ్రమ ద్వారా వస్త్ర ఉత్పత్తి జరిగేది ఒక్క నగరిలోనే. ఇక్కడి ఉత్పత్తులతో ఏటా రూ.300 కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది.

Published : 21 Mar 2023 03:54 IST

ప్రభుత్వానికి నివేదన

నగరిలో ఉత్పత్తి చేసిన వస్త్రాలు (పాత చిత్రం)

నగరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో చేనేత తర్వాత మరమగ్గ పరిశ్రమ ద్వారా వస్త్ర ఉత్పత్తి జరిగేది ఒక్క నగరిలోనే. ఇక్కడి ఉత్పత్తులతో ఏటా రూ.300 కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. స్వదేశంలో సరఫరా చేయడానికి చీరలు, చుడీదార్లు, ధోవతులు, కండువాల ఉత్పత్తిలో ప్రత్యేక నైపుణ్యం చాటుతున్నారు ఇక్కడి కార్మికులు. ఈ పరిశ్రమకు అనుబంధంగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి.

టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి 1998లో అప్పటి ఎమ్మెల్యే వి.దొరస్వామిరాజు స్థలం సేకరించారు. పలు కారణాలతో అది నిలిచిపోయింది. అప్పటినుంచి ప్రతి ఎన్నికల్లో ఇది రాజకీయ హామీగా మారింది. ప్రస్తుతం ఏర్పాటుకు స్థల సేకరణ సాగుతోంది. నగరి మండలం వి.కె.ఆర్‌.పురం వద్ద ఏపీఐఐసీ ద్వారా 330 ఎకరాలు సేకరించారు.

చెన్నైకి చేరువలో..

అంతర్జాతీయ మార్కెట్‌లో వస్త్రాల ఎగుమతికి ప్రధాన నగరం చెన్నై.. నగరికి 95 కి.మీ. దూరం. ఈ పార్క్‌కు ఎంపిక చేసిన స్థలం తిరుపతి-చెన్నై జాతీయ రహదారికి పక్కనే ఉన్న వీకేఆర్‌పురం సమీపంలో ఉంది. హైవే నుంచి ప్రత్యేక రోడ్డు నిర్మించి వసతులు కల్పిస్తే టెక్స్‌టైల్‌ పార్క్‌తో పాటు ఇతర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఫ్యాబ్రిక్స్‌ వస్త్ర ఉత్పత్తితో ప్రత్యక్షంగా 150 కుటుంబాలు వస్త్ర ఉత్పత్తిదారులుగా, పరోక్షంగా 20 వేల నేత కార్మిక కుటుంబాలు ఉపాధి పొందొచ్చు.


స్థలం సేకరిస్తున్నాం

నగరి పరిసరాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన 330 ఎకరాలు వీకేఆర్‌పురంలో, మాంగాడులో 250 ఎకరాల సేకరిస్తున్నాం. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన స్థలాలు ప్రభుత్వం కేటాయిస్తుంది. స్థల సేకరణ వివరాలు ప్రభుత్వానికి నివేదించాం.
 చంద్రశేఖరరెడ్డి, తహసీల్దార్‌, నగరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని