logo

నేడు మహతిలో ఉగాది ఉత్సవం

తితిదే హిందూ ధార్మిక ప్రాజెక్టులు, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం ఉగాది ఉత్సవాన్ని బుధవారం ఉదయం 9.30 గంటలకు నగరంలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.

Published : 22 Mar 2023 03:22 IST

తిరుపతి(తితిదే): తితిదే హిందూ ధార్మిక ప్రాజెక్టులు, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం ఉగాది ఉత్సవాన్ని బుధవారం ఉదయం 9.30 గంటలకు నగరంలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, తితిదే ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ వారిచే వేదపారాయణం, తితిదే ఆగమసలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు వేదాంతం విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం, తిరుపతికి చెందిన ప్రముఖ అవధాని ఆముదాల మురళి అష్టావధానం చేస్తారు.


తెలుగు ప్రజలకు తితిదే ఛైర్మన్‌, ఈవో ఉగాది శుభాకాంక్షలు

తిరుమల: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: జిల్లా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా, చిత్తూరు, తిరుపతి ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.


సర్వదర్శనానికి 15 గంటలు

తిరుమల: శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఐదు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 15 గంటల్లో దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. సోమవారం శ్రీవారిని 62,824 మంది భక్తులు దర్శించుకున్నారు.


తిరువణ్ణామలైకి 16 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

తిరుపతి(ఆర్టీసీ): పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్‌ 5వ తేదీన తమిళనాడులోని తిరువణ్ణామలై (గిరి ప్రదక్షిణ) ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని తిరుపతి, మంగళం, అలిపిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, వాకాడు, సూళ్ళూరుపేట డిపోల నుంచి డీలక్స్‌-1, ఎక్స్‌ప్రెస్‌- 15 మొత్తం 16 సర్వీసులు నడపనున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు ముందుగానే ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా రానుపోను రిజర్వేషన్‌ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు తిరుపతి బస్‌స్టేషన్‌ సహాయ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఏటీఎం) డి.రామచంద్ర నాయుడు చరవాణి సంఖ్య 9959225684ను సంప్రదించాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని