logo

భారంగా పశుపోషణ

వ్యవసాయ యాంత్రీకరణ అన్నదాతలకు లాభదాయంగా ఉన్నా పాడి రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో వరి కోతలకు కూలీలు చేపట్టేవారు. దీంతో గడ్డి పుష్కలంగా లభించేది.

Published : 22 Mar 2023 04:23 IST

గ్రాసం కొరతతో పాడి రైతుల అవస్థలు

పూతలపట్టులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న గ్రాసం

పూతలపట్టు, న్యూస్‌టుడే: వ్యవసాయ యాంత్రీకరణ అన్నదాతలకు లాభదాయంగా ఉన్నా పాడి రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో వరి కోతలకు కూలీలు చేపట్టేవారు. దీంతో గడ్డి పుష్కలంగా లభించేది. ప్రస్తుతం అధిక శాతం మంది వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తుండటంతో ఎండుగడ్డి దొరకడం లేదు. దీని వల్ల పాడి రైతులు అధిక ధరలు వేచ్చించి దూర ప్రాంతాల నుంచి గ్రాసాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఎగుమతి, దిగుమతి రవాణా ఖర్చులు కలిపి మరింత భారంగా మారింది. ఇదే అదనుగా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

గతంలో ప్రభుత్వమే అండ

గ్రాసం కొరత ఏర్పడుతుందన్న ముందు చూపుతో గతంలో తెదేపా ప్రభుత్వం ప్రశుగ్రాస క్షేత్రల పెంపకానికి చేయూతనిచ్చింది. వ్యవసాయ పశుసంవర్థక శాఖలు కలిసి వార్షిక, ఏక వార్షిక గడ్డి విత్తనాలు, నారు అందించారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వాటికి స్వస్తి పలకడంతో పాడి రైతులకు అంతకంతకు పోషణ భారంగా మారింది. తెదేపా ప్రభుత్వం పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేయడమే కాకుండా పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించింది. నేటి ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదు.

ఆకాశాన్ని అంటుతున్న ధరలు

నియోజకవర్గ పరిధిలో తవణంపల్లె, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టు మండలాలు ఉన్నాయి. పశువర్థశాఖ గణాంకాల ప్రకారం నియోజకవర్గంలో 90,556 పాడి పశువులు, 46,432 గొర్రెలు, మేకలు ఉన్నాయి. సుమారు 7వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. కూలీల కొరత, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో అధిక శాతం మంది రైతులు యంత్రాలతో కోతలు చేపడుతున్నారు. యంత్రాల వినియోగంతో పశువులకు సరిపడ గడ్డి దొరకడం లేదు. ఒక్కో పశువుకు రోజుకు మూడు నుంచి ఐదు కిలోల వరకు గడ్డి అవసరం అవుతోందని పోషకులు అంటున్నారు. ప్రస్తుతం ట్రాక్టరు గడ్డి రూ.10-12వేల వరకు పలుకుతుండటం పాడి రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాలు తిరిగి ప్రోత్సహించాలని పశుపోషకులు కోరుతున్నారు.


తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..: దాణా ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. పశువుల పోషణ భారంగా మారింది. ప్రస్తుతం పచ్చగడ్డి లేకపోవడం పాడి పశువులు ఇండ్లకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందించి క్షేత్రాల సాగుకు చేయూతనిచ్చి ఆదుకోవాలి.

లోకేశ్‌, పాడి రైతు, దండుమిట్ట


* ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం..: ప్రస్తుతం గ్రాసం కొరత ఉన్న మాట వాస్తవమే. ఆర్బీకేల ద్వారా రాయితీపై టీఎమ్‌ఆర్‌ దాణా పంపిణీ చేస్తున్నాం. 75శాతం రాయితీతో గ్రాసం విత్తనాలు పంపిణీ చేయడానికి నివేదికలు పంపాం. విత్తనాలు వచ్చిన వెంటనే సరఫరా చేస్తాం. అధికారుల సూచనలు, సలహా మేరకు ఇతర చర్యలు చేపడతాం.

గీతారెడ్డి, పశువైద్యురాలు, పూతలపట్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు