logo

మంచినీరు కరవు

పలమనేరు పట్టణంలోని పెద్దచెరువులోకి మురుగు నీరు చేరి కలుషితమవుతోంది. ఈ నీరు భూమిలోకి ఇంకడంతో దానికి దరిదాపుల్లో ఉన్న బోర్ల నుంచి వచ్చే నీరు కూడా ఉప్పుశాతం ఎక్కువగా ఉంటూ ప్రమాదకరంగా ఉంటోంది.

Published : 22 Mar 2023 04:23 IST

శుద్ధజలం ప్లాంట్లలో నాణ్యత లేమి
కలుషిత నీటితో రోగాల బారిన ప్రజలు

పలమనేరు పట్టణంలోని పెద్దచెరువులోకి మురుగు నీరు చేరి కలుషితమవుతోంది. ఈ నీరు భూమిలోకి ఇంకడంతో దానికి దరిదాపుల్లో ఉన్న బోర్ల నుంచి వచ్చే నీరు కూడా ఉప్పుశాతం ఎక్కువగా ఉంటూ ప్రమాదకరంగా ఉంటోంది. చెరువు సమీపంలో బోర్ల ద్వారా వచ్చే నీటిని పట్టుకునే బకెట్లు, పాత్రలు నల్లగా మసిబారిపోయి ఉంటాయి. దాన్ని బట్టి ఆ నీరు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. అయితే పట్టణంలో ప్రైవేటు నీటి ప్లాంటు నిర్వాహకులు సరఫరా చేసే నీటి విషయంలో అధికారులు ఉదాసీనంగా ఉంటే ఎంత ప్రమాదమో అని ఆలోచించాలి. ఆ నీటిని ఎంత శుద్ధి చేసినా తాగటానికి ప్రమాదకరం. చెరువులో మురుగు నీరు చేరకుండా చేసేంత వరకు ఈ చుట్టుపక్కల లభించే నీటిలో ప్రమాద కారకాలు ఎక్కువగానే ఉంటాయి.

పలమనేరు, న్యూస్‌టుడే: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శుద్ధ జలం అవసరం. అయితే పట్టణాల్లో రక్షిత మంచినీరు అందటం లేదు. మార్కెట్‌లో ఉన్న ప్రైవేటు ఆర్వో ప్లాంటు నీటిని తాగినా ప్రజలకు రోగాలు తప్పటం లేదు. ఇబ్బడిముబ్బడిగా వ్యాపారులు మినరల్‌ వాటర్‌ సరఫరా పేరిట బోరు నీళ్లను నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. పట్టణంలో క్యాన్‌ నీరు రూ.20 చొప్పున ప్రజలకు అమ్ముతున్నారు. వారు నిర్వహించే ఆర్వో ప్లాంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అయినా అధికారులు వాటి గురించి పట్టించుకోరు. పలమనేరు, పుంగనూరు, కుప్పం మున్సిపల్‌ కేంద్రాల పరిధిలో రూ.30 వరకు ప్రైవేటు నీటి విక్రయ ప్లాంట్లు ఉన్నాయి. కొన్ని మినహా చాలా వరకు నాణ్యతా ప్రమాణాలకు దూరంగా పనిచేస్తున్నాయి.

ప్రతి ఒక్కరికి అవసరం

ప్రస్తుతం మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు కూడా క్యాన్‌వాటర్‌ పేరిట నీటిని కొని తాగటం అలవాటు చేసుకున్నారు. దీంతో నీరు విక్రయించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరైన ప్రమాణాలను పాటించకపోవడంతో ఆ నీటిని తాగితే ప్రజలు రోగాల వారిన పడటం ఖాయం. శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేయాలన్నా శుద్ధ జలం ఎంతో అవసరం. చాలా చోట్ల నీటి క్యాన్లను శుభ్రం చేయడం లేదు. వినియోగదారులే స్వయంగా తమ సొంత క్యాన్లతో ప్రస్తుతం నీటిని పట్టుకుంటున్నారు.

శాఖల మధ్య సమన్వయ లోపం

ప్రభుత్వశాఖల మధ్య సమన్వయలోపం నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణకు వరంగా మారింది. ఆహార పరిరక్షణ విభాగం, భూగర్భ జలవనరులశాఖ, రెవెన్యూశాఖలు, నీటి శుద్ధి ప్లాంట్ల విషయంలో పర్యవేక్షణ చేయాలి. ఇందులో ఏ ఒక్కశాఖా దీన్ని పట్టించుకోవడంలేదు. నీటి ప్లాంట్లకు అనుమతులు ఉన్నాయా.. విక్రయిస్తున్న నీరు ఎలా ఉంటోందని పరిశీలించేవారు లేకపోయారు.


ప్లాంట్లను పరిశీలిస్తాం
- మూర్తి, ఆర్‌డీ, మున్సిపల్‌ విభాగం, అనంతపురం

నీటి ప్రమాణాలను పరిశీలించి చర్యలు తీసుకునే బాధ్యత జలవనరులశాఖకు, పొల్యూషన్‌ కంట్రోలు విభాగానికి ఉంది. ప్రస్తుత పరిస్థితిపై మున్సిపల్‌ పరిధిలోని నీటి ప్లాంట్ల విషయాన్ని పరిశీలిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని