logo

మళ్లీ వాయిదానే

వి.కోట మండలం పాపేపల్లి-2 లేఔట్‌లో 120 ఇళ్లు మంజూరు చేసినా... అక్కడ విద్యుత్తు, నీటి వసతి లేదు. లబ్ధిదారులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకుని నిర్మాణాలు చేస్తున్నారు.

Updated : 22 Mar 2023 06:56 IST

ఈనాడు, డిజిటల్‌, చిత్తూరు, న్యూస్‌టుడే, వికోట

మారిన సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం

వి.కోట మండలం పాపేపల్లి-2 లేఔట్‌లో 120 ఇళ్లు మంజూరు చేసినా... అక్కడ విద్యుత్తు, నీటి వసతి లేదు. లబ్ధిదారులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకుని నిర్మాణాలు చేస్తున్నారు. విద్యుత్తు స్తంభాలు నాటినా తీగలు అమర్చలేదు. మౌలిక సదుపాయాలే లేనప్పుడు వేగంగా ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అంతర్గత రహదారులు కూడా సరిగా లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని అంటున్నారు. వి.కోట పట్టణానికి ఆనుకుని ఉన్న లేఔట్‌లోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఫలితంగానే సామూహిక గృహ ప్రవేశాల ముహూర్తం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారీ వాయిదా వేస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో 50 శాతం ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తికాగా చిత్తూరు జిల్లాలో లక్ష్యానికి మించి పూర్తయినా మౌలిక సదుపాయాల లేమి వెంటాడుతోంది. రాష్ట్రంలోని పేదలందరికీ సొంత గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2020- 21 ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో 72,225, తిరుపతి జిల్లాలో 71,867 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబరు 21 నాటికి రెండు జిల్లాల్లో కలిపి కేవలం 34.29 శాతం ఇళ్లు అంటే 49,415 పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.


అధికంగా నిర్మాణాలు చేసినా..

చిత్తూరు జిల్లాలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నా... 50 శాతం లేఔట్లలో కనీస సౌకర్యాలైన నీళ్లు, విద్యుత్తు సౌకర్యం లేదు. ప్రధాన, అంతర్గత రహదాల నిర్మాణమే జరగలేదు. లబ్ధిదారులపై అధికారులు ఒత్తిడి తెచ్చి వేగంగా ఇళ్లు కట్టుకునేలా చేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాల మాటేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండేళ్లవుతోన్నప్పటికీ తవణంపల్లె మండలం గోవిందరెడ్డిపల్లె పంచాయతీ గండుపల్లె, జొన్నగురకల పంచాయతీ నీలంపల్లె లేఔట్‌లో విద్యుత్తు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని లబ్ధిదారులు అంటున్నారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోనూ స్తంభాలు నాటినా కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్నిచోట్ల తీగలు కూడా ఏర్పాటు చేయలేదు. వ్యయప్రయాసలకోర్చి ఇళ్లు నిర్మించుకున్నా.. సౌకర్యాలు లేనప్పుడు నివాసాల్లో ఎలా ఉండాలని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు