logo

ఏళ్లు గడిచినా నీళ్లు రాలే

దాదాపు 30 గ్రామాల దాహార్తి తీర్చాలన్న తాగునీటి పథకం ఆచరణలో గాడితప్పింది. చివరకు ఏళ్లు గడిచినా ప్రజల గొంతు తడపలేకపోయింది. ఇందుకు రూ.19.50 కోట్లు మాత్రం ఖర్చయిపోయాయి.

Published : 22 Mar 2023 04:23 IST

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి ఏడేళ్లు
రూ.19.50 కోట్ల వ్యయం

కాదలూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో పెరిగిన గడ్డి

తడ, న్యూస్‌టుడే: దాదాపు 30 గ్రామాల దాహార్తి తీర్చాలన్న తాగునీటి పథకం ఆచరణలో గాడితప్పింది. చివరకు ఏళ్లు గడిచినా ప్రజల గొంతు తడపలేకపోయింది. ఇందుకు రూ.19.50 కోట్లు మాత్రం ఖర్చయిపోయాయి. తడ మండలం కాదలూరు చెరువులో 2016లో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. పక్కనే పంప్‌హౌస్‌, భూగర్భ ట్యాంకులు, విద్యుత్తు నియంత్రిక తదితర ఏర్పాట్లు చేశారు. సుందరపురం, తడ ప్రాంతాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు పూర్తిచేశారు. ఇక్కడి నుంచి గ్రామాలకు గొట్టాల ఏర్పాట్లు జరిగాయి. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులకు తెలుగుగంగ 8బి బ్రాంచి కాల్వ నుంచి నీటిని పంపింగ్‌ చేయాలని నిర్ణయించారు. అయితే నిధుల లేమి, నీటిలభ్యత కొరవడి తాగునీరు అందే పరిస్థితి లేకుండాపోయింది. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సొంత మండలం పైగా కాదలూరు ఆయన స్వగ్రామం కావడంతో ప్రజలు పథకంపై ఆశలు పెట్టుకున్నారు.

తడ మండలం సముద్ర తీరప్రాంతం కావడంతో వేసవిలో ప్రతి గ్రామంలోనూ తాగునీటికి అవస్థలు పడాల్సిన పరిస్థితి. వేసవిలో ఏవారానికో, పదిరోజులకొకసారి మాత్రమే ప్రజలకు నీళ్లు అందే పరిస్థితి. ఈ నేపథ్యంలో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద గ్రామీణనీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో సమ్మర్‌ స్టోరేజీ నిర్మాణాన్ని ఆరేళ్ల కిందట చేపట్టారు. పథకం పూర్తికాకపోవడంతో పల్లె ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. ఏటా వేసవిలో ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసేవారు కొందరైతే, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి నీటిని మోసుకొస్తున్న వారు మరికొందరు. కనీస అవసరాలకు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కరలేదు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి నీటి సరఫరా అందితే తప్ప వేసవిలో కష్టాలు తీరవని పల్లెజనం వాపోతున్నారు.  

తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి పైపులైన్‌

బుచ్చినాయుడు కండ్రిగ వద్ద తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి కాదలూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు నీటిని పంపింగ్‌ చేయాలని నిర్ణయించాం. ఇందుకు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. టెండర్లు పూర్తయ్యాయి. నిధులు మంజూరు కాగానే పనులు మొదలెడతాం. ప్రధాన కాల్వ నుంచి పుష్కలంగా నీరందే వీలుంది.

చంద్రశేఖర్‌ యాదవ్‌, డీఈఈ, గ్రామీణ నీటిసరఫరా విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు