logo

భారీగా ఎర్రచందనం స్వాధీనం

తమ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు.

Published : 22 Mar 2023 04:23 IST

ఒకరి అరెస్టు, మరొకరు పరారీ

ఎర్రచందనం దుంగలు, నిందితుడిని చూపుతున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి

రేణిగుంట, నారాయణవనం, న్యూస్‌టుడే: తమ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం విమానాశ్రయ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం నారాయణవనం బైపాస్‌ రోడ్డులో ఎస్సై పరమేష్‌నాయక్‌ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా పుత్తూరు వైపు నుంచి నారాయణవనం వైపు వెళ్లే వాహనం అతివేగంగా వచ్చిందన్నారు. దీనిని గమనించిన తమ పోలీసులు ఎంతో చాకచక్యంగా ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారన్నారు. అందులో ఉన్న ఇద్దరిలో ఒకరు పారిపోగా చోదకుడిని అరెస్టు చేశామన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా శోలవరం తాలూకాకు చెందిన మరుదు పాండి వేల్లస్వామి అని తెలిపారు. ఈ ఘనటలో పారిపోయిన వ్యక్తి ప్రధాన స్మగ్లర్‌ అని, అతను శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం చెట్లను కూలీల ద్వారా నరికి, దుంగలుగా మార్చి బెంగళూరు, చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామన్నారు. పట్టుబడిన 824 కేజీల బరువు ఉన్న 25 ఎర్రచందనం దుంగల విలువ రూ.98.88 లక్షలని, వాహనం విలువ రూ.5 లక్షలన్నారు. ఈ ఘటనలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులను అందజేశారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్‌, విమలకుమారి, పుత్తూరు డీఎస్పీ రామరాజు, పుత్తూరు గ్రామీణ సీఐ సురేష్‌కుమార్‌, నారాయణవనం, వడమాలపేట ఎస్సైలు పరమేష్‌నాయక్‌, రామాంజనేయులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని