logo

అనిశా వలలో తహసీల్దారు, వీఆర్వో

పట్టాదారు పాసు పుస్తకం మార్పు కోసం లంచం తీసుకుంటూ శ్రీరంగరాజపురం తహసీల్దారు షబ్బీర్‌బాషా, వీఆర్వో గోవిందరెడ్డి మంగళవారం పట్టుబడ్డారు.

Published : 22 Mar 2023 04:34 IST

అనిశాకు చిక్కిన వీఆర్వో గోవిందరెడ్డి, తహసీల్దారు షబ్బీర్‌బాషాతో అధికారులు

శ్రీరంగరాజుపురం, పాలసముద్రం, పెనుమూరు, న్యూస్‌టుడే: పట్టాదారు పాసు పుస్తకం మార్పు కోసం లంచం తీసుకుంటూ శ్రీరంగరాజపురం తహసీల్దారు షబ్బీర్‌బాషా, వీఆర్వో గోవిందరెడ్డి మంగళవారం పట్టుబడ్డారు. మండలంలోని శెట్టివానత్తం గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి మృతి చెందడంతో అతని పేరుపై 1.35 ఎకరాల భూమిని పెద్దకుమారుడు రవికుమార్‌రెడ్డి పేరుపై మార్చాలని నెల కిందట చిన్నకుమారుడు లక్ష్మణరెడ్డి తహసీల్దారు షబ్బీర్‌బాషా, వీఆర్వో గోవిందరెడ్డిని సంప్రదించారు. రూ.25 వేలు ఇస్తేనే మార్చుతానని తహసీల్దారు చెప్పారు. రూ.20 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. విషయాన్ని బాధిత రైతు అవినీతి నిరోధకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం ఉదయం నగదును అందిస్తుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. అనిశా అడిషనల్‌ ఎస్పీ దేవప్రసాద్‌, డీఎస్పీ జనార్దననాయుడు, సీఐ ప్రతాప్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

బాధిత రైతు లక్ష్మణరెడ్డి


ప్రతి పనికీ.. ఒక్కో ధర

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: రెవెన్యూ శాఖలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా తహసీల్దార్‌ కార్యాలయాల్లో దస్త్రం కదలాలంటే చేయి తడపనిదే ఏ పనీ జరగడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి. తాజాగా మంగళవారం మ్యుటేషన్‌ నిమిత్తం ఎస్‌ఆర్‌పురం మండల తహసీల్దార్‌ షబ్బీర్‌బాషా, వీఆర్వో గోవిందరెడ్డి ద్వారా రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ షబ్బీర్‌ బాషాపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మండలంలో రెవెన్యూకు సంబంధించిన అన్ని వ్యవహారాలు సదరు వీఆర్వో ద్వారానే చక్కబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి వీరిద్దరూ అనిశా అధికారులకు పట్టుబడటంతో మండలంలో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని