logo

ఆశలన్నీ.. పరిహారంపైనే

అకాల వర్షం అన్నదాతల ఆశలన్నీ అడియాసలు చేసింది. చేతికందే దశలో పంట నష్టంతో వరి, వేరుసెనగతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Published : 22 Mar 2023 04:36 IST

క్షేత్రస్థాయిలో కన్పించని అధికారులు

తొట్టంబేడు: పూడి వద్ద తడిసిన ధాన్యం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: అకాల వర్షం అన్నదాతల ఆశలన్నీ అడియాసలు చేసింది. చేతికందే దశలో పంట నష్టంతో వరి, వేరుసెనగతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే దశలో వడగళ్ల వర్షం పడటంతో వరిపైరు నేలకొరిగింది. ఇప్పటి వరకు శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలో దాదాపుగా 2,400 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. వేరుసెనగ ఒబ్బిడి చేసే క్రమంలో వర్షం కారణంగా కాయలు కుళ్లిపోవడంతో అన్నదాతలకు నష్టం తప్పలేదు. 700 ఎకరాల్లో వేరుసెనగకు నష్టం వాటిల్లింది.  ఉద్యానపంటలు భారీగానే దెబ్బతిన్నాయి. సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లో వరి పాక్షికంగా దెబ్బతిన్నా దాదాపు 500 ఎకరాల్లో మిరప పంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.


ఈ చిత్రంలోని రైతు పేరు శ్యామ్‌. ఊరు... తొట్టంబేడు మండలం పూడి. ప్రకృతి వ్యవసాయం లక్ష్యంగా సాగు చేపట్టారు. 26 ఎకరాల్లో వరి సాగు చేశారు. 20 ఎకరాల్లో పంట ఉత్పత్తులను తితిదే కొనుగోలు చేసింది. మిగిలిన ఆరు ఎకరాల్లో ధాన్యం నిల్వలు తీసుకుపోతామని చెప్పి రోజులు గడిపారు. ఊహించని వర్షంతో కోత కోసి నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం గింజల నుంచి మొలకలు వచ్చేశాయి. సేంద్రియ పద్ధతులతో సాగు చేసిన టమోటా, వంగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఊహించని వర్షంతో దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు  ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎవ్వరూ వచ్చి తమకు జరిగిన నష్టంపై వివరాలు సేకరించలేదని వాపోయారు.


అంచనాలు అంతంతమాత్రం

పంటలకు నష్టం జరగ్గా... వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో పంట నష్టం గురించి అంచనాలు సిద్ధం చేస్తుందని చెప్పినా ఇప్పటి వరకు నష్టం జరిగిన రైతులను కలసి వివరాలు ఆరా తీసిన దాఖలాలు లేవు. వడగళ్ల వర్షం పడిన ప్రాంతాల్లో దాదాపు పంట నష్టం జరిగిందని తక్కువ ఎకరాల్లో నమోదు చేస్తున్నారని, వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి పోతే తప్ప నష్ట పరిహారం అందే అవకాశం ఉండదని రైతులు వాపోతున్నారు. అధికారులు మాత్రం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా వరి కోతలు పూర్తయ్యాయని, నష్ట పరిమితి తక్కువేనని చెప్తుండటం గమనార్హం.ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోకుంటే తమ పరిస్థితి అగమ్యగోచరమంటూ బాధిత రైతులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని