logo

లంచం ఇస్తేనే.. దస్త్రం కదిలేది!

‘తహసీల్దారు కార్యాలయాలకు వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తీర్చండి.. ఒకవేళ సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించండి’ అంటూ కలెక్టర్‌, జేసీ పదేపదే రెవెన్యూ అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నారు.

Published : 24 Mar 2023 01:25 IST

అర్జీదారులకు తేల్చి చెబుతున్న కొందరు తహసీల్దార్లు, సిబ్బంది
కుప్పం, చిత్తూరు, గంగాధరనెల్లూరు నియోజక వర్గాల్లో ఆరోపణల వెల్లువ

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: ‘తహసీల్దారు కార్యాలయాలకు వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తీర్చండి.. ఒకవేళ సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించండి’ అంటూ కలెక్టర్‌, జేసీ పదేపదే రెవెన్యూ అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడంలేదు. ఫలితంగా ప్రజలు నెలల తరబడి తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో అడిగినంత డబ్బు లంచంగా ఇస్తే తప్ప అర్జీలు ముందుకు కదలడం లేదు. అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు లంచావతారాల బాగోతం బయటపడుతోంది.

...ఇదిగో ఉదాహరణ

తాజాగా ఎస్‌ఆర్‌పురం మండలం శెట్టివానత్తం గ్రామానికి చెందిన యువ రైతు లక్ష్మణరెడ్డి స్థానిక తహసీల్దారు షబ్బీర్‌ బాషా, వీఆర్వో గోవిందరెడ్డిపై అనిశా అధికారులకు ఫిర్యాదు చేయడం.. వారు రంగంలోకి దిగి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 1.35 ఎకరాల మ్యుటేషన్‌ కోసం వారు రూ.20వేలు వసూలు చేస్తూ అనిశాకు దొరకడంతో మరోసారి రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతిపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కుప్పం, చిత్తూరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనే ప్రధానంగా ఈ తంతు జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఇటువంటి వారిపై ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని విమర్శలున్నాయి.

భూ మార్పిడి చేయాలంటే రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే

చిత్తూరు నియోజకవర్గంలోని కీలక మండలంలో ఓ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు ఏ పనిచేయాలన్నా వీఆర్వోల ద్వారా డబ్బు వసూలు చేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎస్‌ఆర్‌పురంలో అనిశా దాడులు జరిగితే ఇక్కడున్న కొందరు సిబ్బంది తహసీల్దారు కార్యాలయాన్ని విడిచి వెళ్లడాన్ని చూస్తుంటే అవినీతి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మండలంలో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతుండటంతో వారసత్వంగా వచ్చిన భూములను మ్యుటేషన్‌ చేయాలని రైతులు అర్జీలు ఇస్తే నెలల తరబడి పరిష్కరించడం లేదు. భూమి విలువను బట్టి రూ.40వేలు- రూ.2 లక్షలు లంచంగా తీసుకుంటున్నారు. అదే వ్యవసాయ భూమిలో లే ఔట్‌ వేసేందుకు సదరు భూమార్పిడికి రూ.5 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే సదరు అర్జీకి బూజు పడుతోంది. తరచూ ఈ కార్యాలయంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి వ్యవహార శైలి మార్చుకోవాలని హెచ్చరించినా ఫలితం లేదు. ఇటీవల ఓ అధికారిపై బదిలీ వేటు వేసినప్పటికీ మరొకరిని అక్కడే ఉంచడంతో ఇప్పట్లో మార్పు వచ్చే సూచనలు లేవని ప్రజలు అంటున్నారు.

పట్టా భూములూ ‘అనాధీనం’ చేసి..

కుప్పం నియోజకవర్గంలో గతంలో పనిచేసిన తహసీల్దారుపై లెక్కకు మిక్కిలి ఆరోపణలున్నాయి. కొన్నేళ్ల క్రితమే ఆయన ఉన్న కార్యాలయంపై అనిశా అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. సదరు తహసీల్దారు కుప్పం నియోజకవర్గంలో విధులు నిర్వర్తించిన సమయంలో కొన్ని దశాబ్దాల క్రితమే రైతు పేరుపై పట్టా ఉన్న భూములనూ ‘అనాధీన’ జాబితాలో చేర్చారు. దాదాపు అన్ని పంచాయతీల్లోనూ ఇలా మార్చారు. ముందుగా నోటీసులు ఇవ్వకుండానే  మార్చడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాధీన జాబితా నుంచి తొలగించాలంటే ఎకరాకు రూ.50వేలు- రూ.2 లక్షలు సమర్పించుకోవాల్సిందే. కొన్నిరోజుల క్రితం సదరు వ్యక్తిని ఆ మండలం నుంచి గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఓ మండలానికి బదిలీ చేశారు. ఇక్కడ ఆయన ఏవిధమైన లీలలు చూపిస్తారో అని రెవెన్యూ వర్గాలే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో ఓ  తహసీల్దారు బహిరంగంగానే ఓ రైతును డబ్బులు డిమాండ్‌ చేయడం, సదరు వీడియో వైరల్‌ కావడం.. రెవెన్యూ శాఖకే తలవంపులు తెచ్చిపెట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని