logo

ఇసుక తోడేస్తున్నారని ఆందోళన

కుశస్ధలినదిలో ఇసుక అక్రమంగా తోడేస్తున్నారని, ప్రభుత్వ అనుమతి లేని ట్రాక్టర్లు నిత్యం ఇసుక తరలిస్తున్నాయంటూ మండలంలోని కరకంటాపురం గ్రామస్థులు గురువారం అధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 24 Mar 2023 02:09 IST

కుశస్థలి నదిలో ట్రాక్టర్‌లో ఇసుక నింపుతున్న కూలీలు

నగరి: కుశస్ధలినదిలో ఇసుక అక్రమంగా తోడేస్తున్నారని, ప్రభుత్వ అనుమతి లేని ట్రాక్టర్లు నిత్యం ఇసుక తరలిస్తున్నాయంటూ మండలంలోని కరకంటాపురం గ్రామస్థులు గురువారం అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు పత్రం సహా పలు చిత్రాలను వారు విలేకరులకు అందజేసి మాట్లా డారు. అనుమతిలేని అక్రమ రవాణాతో నదిలో భవిష్యత్‌లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి సాగు, తాగునీరు సమస్య తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-20లో ఈ నదిలో ఇదే తరహాలో ఇసుకను పూర్తిగా తోడేయడంతో తాగునీటి ఎద్దడి తలెత్తిందన్నారు. నగరి పురపాలక సంఘ పరిధిలోని 12 గ్రామాలు, మండల పరిధిలో మరో ఆరు గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ అదే స్థాయిలో ఇసుక అక్రమ రవాణా యథేఛ్చగా సాగుతోందన్నారు. ప్రభుత్వం జగనన్న గృహ సముదాయాల నిర్మాణాల అవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తే దాని ముసుగులో ఇష్టానుసారంగా తరలించేస్తున్నారని వాపోయారు. ఒక అనుమతి పత్రంతోనే అయిదు నుంచి పది ట్రిప్‌లు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు.


చర్యలు తీసుకుంటాం:

చంద్రశేఖరరెడ్డి, తహసీల్దార్‌, నగరి

ప్రభుత్వ గృహ నిర్మాణాల కోసం మండలంలోని ఏకాంబరకుప్పం, మిట్టపాలెం, నాగరాజుకుప్పం మూడు చోట్ల ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశాం. మండలం పరిధిలో ఎంపీడీవో, పట్టణ పరిధిలో మున్సిపల్‌ కమిషనర్‌ సంతకం చేసిన అనుమతి పత్రాలు ఉంటేనే ఇసుక రవాణా చేయాలి. అక్రమ రవాణాపై ఫిర్యాదులు వచ్చినమాట వాస్తవమే. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని