logo

చిన్నారుల కుంచె.. చిత్తరువులు భళా

పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. రోజు సాధన చేస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు.

Updated : 24 Mar 2023 04:03 IST

తాము గీసిన చిత్రాలు చూపుతున్న విద్యార్థినులు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. రోజు సాధన చేస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. ఒకవైపు చదువులో ఉత్తమ మార్కులు సాధిస్తూ.. మరోవైపు చిత్రలేఖనంలో రాణిస్తూ భళా అనిపిస్తున్నారు. కళాత్మక, సృజనాత్మక చిత్రాలకు రూపమిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. పాఠశాలలోని 7, 8, 9 తరగతులకు చెందిన సుమారు 50 మంది బాలికలు చిత్రాలు గీయడంలో సత్తా చాటుతున్నారు. వీరు గీసిన చిత్రాల్లో దేవతామూర్తులు, జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, పక్షులు, ప్రకృతి అందాలు.. తదితర రూపాలను కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. ప్రధానోపాధ్యాయిని తిరుమలమ్మ, ఆధ్వర్యంలో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కల్చరల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ లక్ష్మీ బాలికలకు అల్లికలు, ఫ్లవర్‌వాజులు, ఇంటిలో అందంగా అలంకరించే వస్తువులు, గాజులు, బొట్టుబిల్ల, ఎంబ్రాయిండరీ, చీరలపై రంగులతో పాటు చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. ఏటా డివిజన్‌ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకుంటున్నారు.

చదువుతోపాటు.. పాఠశాలలో అనేక మంది బాలికలు చదువులో రాణిస్తూ.. అద్భుతంగా చిత్రాలు గీస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కళ్లతో చూసిన దృశ్యాలను కూడా చిత్రాలుగా మలచడం నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సంసిద్ధమవుతున్నారు.

సృజనాత్మకత బయటకు తీసే యత్నం

మా పాఠశాలలో 32 మంది వరకు విద్యార్థినులు చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. వీరిలో పది మంది జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని లక్ష్యంగా పెట్టుకుని శిక్షణ అందిస్తున్నాం. డ్రాయింగ్‌ ఉపాధ్యాయిని ఆధ్వర్యంలో వారికి తర్పీదునిస్తున్నాం. భవిష్యత్తులో ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.

తిరుమలమ్మ, ప్రధానోపాధ్యాయిని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని