logo

కాలువలు, వంకలు కబ్జా

పట్టణం, గ్రామాలనే తేడా లేకుండా ఖాళీ జాగా కనిపిస్తే అక్రమార్కులు పాగా వేస్తున్నారు. పంట, మురుగు కాల్వలు, వాగు, వంకలు పరిస్థితి సరేసరి.

Published : 24 Mar 2023 03:02 IST

రూపు కోల్పోయిన నీటి వనరులు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణం, గ్రామాలనే తేడా లేకుండా ఖాళీ జాగా కనిపిస్తే అక్రమార్కులు పాగా వేస్తున్నారు. పంట, మురుగు కాల్వలు, వాగు, వంకలు పరిస్థితి సరేసరి. చుట్టు పక్కలా ఉండే పట్టాదారులు కొంచెం, కొంచెంగా కలిపేసుకుని వాటి రూపురేఖలు మార్చేస్తున్నారు. ఫలితంగా వర్షాకాలంలో నీటి పారుదల వసతి లేక వరద మొంచెత్తే దుస్థితి నెలకొంది. పుంగనూరు నియోజకవర్గంలోని గ్రామాల పరిధిలో వాగులు, వంకలను ఆక్రమిస్తుండగా.. పట్టణంలో పంట, మురుగు కాల్వలు స్వాహా చేస్తూ ఇష్టానుసారంగా శాశ్విత నిర్మాణాలు చేపడతున్నారు. దీంతో రహదారులు కుంచించుకుపోయి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తున్నాయి. ఇంతా జరుగుతున్నా కాపాడిల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సమస్యను గుర్తించినా తమకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేస్తున్నారని వీరి నిర్లక్ష్యంతో అక్రమార్కులు మరింత పెట్రేగి పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పుంగనూరు పట్టణం, చౌడేపల్లి మండలంలోని ఉదంతాలు ఉదాహరణలు మాత్రమేనని, ఇలాంటివి చాలాచోట్ల ఉన్నాయని పలువురు రైతులు చెబుతున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏదైనా చిన్న పంట కాల్వ అనుకేంటే పొరపాటే. దాదాపు 20 అడుగుల వెడల్పుతో సాగే మొరవ కాల్వ. చుట్టు పక్కలా పట్టదారులు మట్టిపోసి వారి పొలం కలిపేసుకోగా కేవలం 3 అడుగుల కాల్వ మిగిలింది. ఈ చోద్యం చౌడేపల్లె మండలం లద్దిగం వద్ద మామిడికుంట మొరవ వంక పరిస్థితి ఇది. కుంట మొరవ పారితే ఈ కాలువలో సాగడం సాధ్యమేనా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరించకుంటే ఆ కాల్వ సైతం కనుమరుగై పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధంగా సాగుతున్న వంకను సర్వేచేసి ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అక్రమాన్ని స్థానిక తహసీల్దారు మాధవరాజు దృష్టికి తీసుకెళ్లగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులతో సమగ్రంగా విచారించి పూర్తి స్థాయి మొరవ కాల్వ ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఈ చిత్రం పుంగనూరు పట్టణ నడిబొడ్డులోనిది. పట్టణం మీదుగా వెళ్లే ముంబై-చెన్నై జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించిన కాలువలపై యథేచ్ఛగా దుకాణాలు వెలిసాయి. వర్షం, వరద నీరు, మురుగు ప్రవహించేందుకు కాల్వలు తవ్వారు. అయితే దుకాణాదారులు ఎక్కడికక్కడ ఆక్రమించేసుకుని వినియోగించుకుంటున్నారు. దీనికి తోడు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మురుగు నీరు, దుకాణాల్లో వచ్చే ఇతర వ్యర్థాలను అందులో పడేస్తున్నారు. ఫలితంగా మురుగు కదిలే పరిస్థితి లేక దుర్వాసన వెదజల్లుతుంది. నిర్వహణ చేపట్టాల్సిన పురపాలిక అధికారులు కనీసం ఇటు కన్నెత్తి చూడటం లేదని వాదనలున్నాయి. కాల్వలతో పాటు ఫుట్‌పాత్‌ను ఆక్రమించడంతో కనీసం నడించేందుకు దారి లేక పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు తోపుడు బండ్లు రోడ్లపైనే నిలిపి వ్యాపారాలు చేస్తుండటంతో మరింత ఇబ్బందిగా మారి ట్రాఫిక్‌ కష్టాలు ఎదురౌవుతున్నాయి. దుకాణదారులు పట్టలు, రేకులు నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. ముఖ్యంగా పురపాలక బస్టాండు నుంచి ఇందిరా కూడలి వరకు, గోకుల్‌ సర్కిల్‌, నాగప్పాళ్యం, రాతిమసీదు వీధుల్లో ఈ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. ఈ విషయంపై పుర కమిషనర్‌ నరసింహప్రసాద్‌ను వివరణ కోరగా పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామన్నారు. దుకాణదారులు స్వచ్ఛందంగా కాలువలపై ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని