logo

చిరుప్రాయం.. ప్రతిభ అపారం

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఈ చిన్నారులు క్రీడల్లో ఉత్తమంగా రాణిస్తున్నారు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు.

Updated : 24 Mar 2023 03:48 IST

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే : పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఈ చిన్నారులు క్రీడల్లో ఉత్తమంగా రాణిస్తున్నారు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. చిన్న వయసు నుంచే నిరంతరం సాధన కొనసాగిస్తూ వచ్చినవారు ప్రస్తుతం సత్ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాంతం చేసుకుంటున్నారు.


కవలల పతకాల పంట

నాయుడుపేటలోని లక్ష్మణ నగర్‌కు చెందిన అంతర్జాతీయ పారా అథ్లెట్‌, రైల్వే ఉద్యోగి అయిన ఎం.లక్ష్మయ్య, స్వప్న దంపతులకు మహీధర్‌, మయూరి అనే కవలలు సంతానం. వీరి వయస్సు ఎనిమిదేళ్లు. మూడో తరగతి చదువుతున్నారు. తండ్రి క్రీడాకారుడు కావడంతో చిన్నప్పటి నుంచే మైదానానికి వెళ్లడం అలవాటైంది. ఉదయం సాయంత్రం వేళల్లో గంటకుపైగా సాధన చేసేవారు. అలా పరుగులో ప్రావీణ్యం పొందారు. ప్రస్తుతం అంతర రాష్ట్ర పరుగు పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకుంటూ అభినందనలు అందుకుంటున్నారు. ఒలింపిక్‌ పోటీల్లో పాల్గొనాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. 2021లో నాయుడుపేట ఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి పరుగు పోటీల్లో 300 మీటర్లలో మహీధర్‌ ప్రథమ, మయూరి ద్వితీయ స్థానంలో నిలిచారు.  2023లో తిరుపతి చవటగుంటలో జరిగిన 100 మీటర్ల పరుగులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరిగిన కిడ్స్‌ మారథాన్‌ పోటీల్లో 300 మీటర్ల పరుగులో బాలబాలికల విభాగాల్లో బంగారు పతకాలు పొందారు. చెన్నై బీచ్‌రోడ్డులో జరిగిన 3 కి.మీ. పరుగులో ఇద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు. ఈఏడాది తిరుపూర్‌ జిల్లాలో జరిగిన 3 కిలోమీటర్ల మారథాన్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంగణంలో 60 మీటర్ల పరుగులో మూడు, ఐదో స్థానంలో నిలిచారు.


పంచ్‌ విసిరితే పతకమే

పతకాలతో పూజిత, మహిత

నాయుడుపేట పిచ్చిరెడ్డితోపు, శ్రీరామ్‌నగర్‌కు చెందిన పూజిత, మహితలు ఐదో తరగతి చదువుతున్నారు. వీరు తైక్వాండోలో ఆరేళ్లుగా శిక్షణ పొందుతున్నారు. బ్లాక్‌బెల్టు లక్ష్యంగా సాధన చేస్తున్నారు. చదువులో ప్రతిభచూపే చిన్నారులు తైక్వాండోనూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. మూడేళ్లుగా వరుసగా జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు నెల్లూరు ఏసీసుబ్బారెడ్డి ప్రాంగణంలో జరగ్గా కుమితే విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకాలు అందుకున్నారు. అటు క్లిష్టమైన ఆసనాలు సైతం వేస్తూ యోగాలో రాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని