logo

స్కిట్‌పై మళ్లీ ఆశలు..!

స్కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జేఎన్‌టీయూలో విలీనంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా ఆల్‌ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) అనుమతులకు అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది.

Published : 27 Mar 2023 02:35 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: స్కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జేఎన్‌టీయూలో విలీనంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా ఆల్‌ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) అనుమతులకు అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇక్కడి కళాశాల విషయమై వస్తున్న విమర్శలకు స్వస్తి పలుకుతూ కళాశాలను మూతపడనీయమని, జేఎన్‌టీయూలో విలీనం చేయడంతో పాటు తిరిగి వైభవాన్ని తీసుకువస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏఐసీటీఈ ఇచ్చిన అవకాశంతో మళ్లీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశలు పెంచుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా ప్రతి కళాశాల చేర్చుకోదల్చిన విద్యార్థులు, వసతులు, ప్రయోగశాలలు, బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి వివరాలతో అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అలా తీసుకున్న కళాశాలలకే కొనసాగే వీలుంటుంది. గడిచిన నాలుగేళ్లుగా స్కిట్‌ ఈ తరహా అనుమతులు తీసుకోవడం లేదు.

రానున్న విద్యా సంవత్సరం కళాశాలను కొనసాగించాలంటే విధిగా ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం వచ్చే నెల 6వ తేదీలోపు కళాశాల కొనసాగింపునకు ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే నెల 14వ తేదీలోపు జరిమానాతో అనుమతి పొందే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే కళాశాల భవితవ్యంపై హైకోర్టులో వాద, ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ అధికారులు పూర్తిగా కళాశాలను మూతవేసినట్లుగా జేఎన్‌టీయూ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం పొందేందుకు ప్రయత్నించడం పట్ల హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరేమో కళాశాలకు వైభవాన్ని తీసుకువస్తామని భరోసా ఇస్తుంటే, అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని