logo

దుకాణాల తొలగింపును అడ్డుకున్న తెదేపా నాయకులు, స్థానికులు

పెనుమూరులోని శ్రీకోదండరామస్వామి దేవాలయానికి చెందిన దేవాదాయశాఖ భూమిలోని దుకాణాల తొలగింపును ఆదివారం తెదేపా నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Published : 27 Mar 2023 02:35 IST

దేవాదాయశాఖ అధికారులను ప్రశ్నిస్తున్న తెదేపా నాయకులు

పెనుమూరు, న్యూస్‌టుడే: పెనుమూరులోని శ్రీకోదండరామస్వామి దేవాలయానికి చెందిన దేవాదాయశాఖ భూమిలోని దుకాణాల తొలగింపును ఆదివారం తెదేపా నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెనుమూరు మధ్యలో ఉన్నత పాఠశాల పక్కన ఆలయానికి సంబంధించి 1.12 ఎకరాల భూమి ఉంది. అందులో ప్రస్తుతం తాత్కాలికంగా బస్టాండు ఏర్పాటు చేశారు. అక్కడ కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిసస్తున్నారు. పెనుమూరుకు తితిదే కల్యాణ మండపాన్ని మంజూరు చేసింది. అందుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వాలని తితిదే కోరడంతో ఆలయానికి చెందిన స్థలాన్ని దేవాదాయశాఖ అధికారులు బదిలీ చేశారు. తితిదే నిధులు మంజూరు చేసిందని కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకు ఆ స్థలంలో ఉన్న దుకాణాలను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ సుమన ఆధ్వర్యంలో ఈవో తిమ్మారెడ్డి, సిబ్బంది జేసీబీని తీసుకుని అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మండల తెదేపా అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రుద్రయ్యనాయుడు, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, పార్లమెంటు కార్యదర్శి రెడ్డెప్ప, స్థానికులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

మాన్యం భూముల విషయాన్ని తేల్చండి: రూ.కోట్ల విలువైన స్థలాన్ని తితిదేకు ఎలా ఇస్తారని దేవాదాయశాఖ అధికారులను నిలదీశారు. ఆలయ అభివృద్ధిని పట్టించుకోకుండా భూమిని ఎలా ఇస్తారన్నారు. ఆలయానికి సంబంధించి చింతపెంట, అమ్మగారిపల్లె రెవెన్యూల్లో 120 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయన్నారు. ముందు వాటి విషయాన్ని తేల్చాలని డిమాండు చేశారు.దాతలు ఇచ్చిన భూమిని మీరు ఎలా తితిదేకు ఇస్తారని నిలదీశారు. ఇందుకు దేవాదాయశాఖ అధికారులు అన్నింటిపై చర్యలు తీసుకుంటామని తెలిపినా దుకాణాలు తొలగించేందుకు నాయకులు ఒప్పుకోలేదు. భూమిని 33 ఏళ్లకు తితిదేకు ఇచ్చామని కల్యాణ మండపం నిర్వహణ, వచ్చే ఆదాయాన్ని ఆలయానికి చెందేలా రాతపూర్వకంగా తితిదే ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని కోరగా ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజులు గడువు ఇవ్వాలని నాయకులు కోరారు. ఇందుకు అధికారులు ఒప్పుకుని అక్కడి నుంచి వెనుతిరిగారు. ఎస్సై అనిల్‌కుమార్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని