logo

ఆటల్లో చిరుతలు

కబడ్డీ, ఖోఖో.. ఎంతో క్లిష్టమైన క్రీడలు. ఆట సాధనలో గాయాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ క్రీడల్లో అధిక శాతం మంది గ్రామీణులే సత్తా చాటుతుంటారు.

Updated : 27 Mar 2023 05:18 IST

నిత్య సాధన
జాతీయ స్థాయి పతకాలే లక్ష్యం

న్యూస్‌టుడే, చిత్తూరు(క్రీడలు): కబడ్డీ, ఖోఖో.. ఎంతో క్లిష్టమైన క్రీడలు. ఆట సాధనలో గాయాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ క్రీడల్లో అధిక శాతం మంది గ్రామీణులే సత్తా చాటుతుంటారు.. నిత్య సాధనతో ప్రతిభకు పదును పెట్టి అత్యద్భుత ఆటతీరుతో ఆటల బరిలో విజృంభిస్తున్నారు వీరు.. ప్రత్యర్థి ఎవరైనా లెక్కించక.. పోరాటపటిమలో ధీరులనిపిస్తున్నారు. జాతీయ స్థాయి రాణింపే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు చెందిన ఆటగాళ్లు.


కేక పెట్టిస్తాడు

రాజు ఖోఖో ఆటగాడు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఐరాల మండలం స్వస్థలం. గ్రామీణ వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. రాజు చిన్ననాటి నుంచి ఆటల్లో చురుకు. పాఠశాల స్థాయి నుంచి ఖోఖో సాధన చేస్తూ ఆటలో నైపుణ్యం సాధించాడు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో తలపడి పతకాల్ని గెలిచాడు. 2019లో చిత్తూరులో జరిగిన అండర్‌-19 స్కూల్‌ గేమ్స్‌లో ప్రాతినిథ్యం వహించాడు. ఈ పోటీల్లో జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. ఇంకా అసోసియేషన్‌ మీట్‌లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే లక్ష్యంగా.. నిత్యం సాధన చేస్తున్నాడు.


భళా ఎగోమి..

ఎగోమి కబడ్డీ క్రీడాకారిణి. స్వస్థలం నగరి మండలం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎగోమి డిగ్రీ వరకూ చదివింది. చిన్ననాటి నుంచి కబడ్డీ అంటే ఆసక్తి. ఆరో తరగతి నుంచి ఇందులో సాధన చేస్తోంది. పాఠశాల స్థాయిలో నాలుగు సార్లు రాష్ట్ర జూనియర్స్‌, కళాశాల స్థాయిలో రెండు సార్లు సీనియర్స్‌ విభాగాల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ కంపెనీలో విధులు నిర్వర్తిస్తోంది. ఇటు ఉద్యోగం చేస్తూనే అటు క్రీడల్లో సాధనకు అవసరమైన సమయాన్ని కేటాయిస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ప్రస్తుతం సాధన చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని