logo

నిధులు రావు.. నీళ్లు పారవు

వ్యవసాయ రంగ పురోభివృద్ధికి దోహదపడుతూ రైతులు, కూలీల ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకురావడంలో జలవనరుల శాఖది కీలక పాత్ర.

Published : 27 Mar 2023 03:25 IST

నాలుగేళ్లుగా నిస్తేజంలో జలవనరుల శాఖ అధికారులు

బైరెడ్డిపల్లె మండలం కైగల్‌ గ్రామ సమీపంలో దెబ్బతిన్న చెరువు మొరవ(పాతచిత్రం)

వ్యవసాయ రంగ పురోభివృద్ధికి దోహదపడుతూ రైతులు, కూలీల ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకురావడంలో జలవనరుల శాఖది కీలక పాత్ర. శాఖకు గత ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి నిధులు విడుదల చేసేవి. నాలుగేళ్లుగా పరిస్థితి మారింది. నిధులు మంజూరు చేయాలంటూ ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా అవి బుట్టదాఖలవుతున్నాయి. ఫలితంగా చెరువులకు మరమ్మతులు చేయక భూములు బీళ్లుగా మారుతున్నాయి. హంద్రీ- నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ పనులు చేసిన గుత్తేదారులకూ నాలుగేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఆ పనులూ పూర్తి కాలేదు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు  : రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలోనే ఎక్కువ చెరువులు ఉన్నాయి. 100 ఎకరాలలోపు విస్తీర్ణంలో 3,761 చెరువులు ఉండగా.. వాటి పరిధిలో 65,642 ఎకరాల ఆయకట్టు ఉంది. 100 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న 230 చెరువుల ద్వారా 47,349 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సుమారు 1.13 లక్షల ఎకరాలు చెరువుల కిందే సాగవుతున్నాయి. రెండేళ్లుగా కురిసిన భారీ వర్షాలకు ఇంతటి కీలకమైన జలవనరులు దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వరద చేరడంతో గండ్లు, కోతలకు గురయ్యాయి. మొత్తంగా 1,318 చెరువులకు నష్టం వాటిల్లింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేసినా శాశ్వతంగా చేయలేదు. పనులు చేపట్టడానికి ఇదే సరైన సమయమైనా నిధులు విడుదల కాక ఏం చేయలేని దుస్థితిలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు.  

నీరు- చెట్టు బిల్లులు రూ.150 కోట్లు

భూగర్భ జలాలను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ పరిధిలో నీరు- చెట్టు కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 900 పనులు చేశారు. చెరువుల్లో పూడికతీత, సప్లయ్‌ ఛానళ్ల పునరుద్ధరణ వంటి అభివృద్ధి పనులు జరిగాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్‌ విచారణ పేరిట బిల్లులను నిలిపేశారు. దీంతో కొందరు గుత్తేదారులు హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుని బిల్లులు పొందారు. మరికొందరికి చెల్లింపులు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వ ఒత్తిడితో ఉన్నతాధికారులు నిధులు విడుదల చేయకపోవడంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇప్పటికీ సుమారు రూ.150 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు అప్పట్లో పనిచేసిన కొందరు అధికారులు నాణ్యత విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని భావించిన సర్కారు వారికి తాఖీదులు ఇచ్చింది. ఈ కారణాలతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులంటేనే గుత్తేదారులు వణికిపోతున్నారు. ఫలితంగా గతంలో క్షణం తీరిక లేకుండా ఉన్న అధికారులు, సిబ్బంది ప్రస్తుతం కార్యాలయాల్లో ఖాళీగా ఉంటున్నారు.

హంద్రీ- నీవా బకాయిలు రూ.30 కోట్లు

గతంలో హంద్రీ- నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ పనులు చేపట్టిన గుత్తేదారులకు మరో రూ.30 కోట్ల వరకు బకాయిలు రావాలి. నాలుగేళ్లుగా సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నా నిధులు లేకపోవడంతో సాఫ్ట్‌వేర్‌ తీసుకోవడంలేదు. ప్రస్తుతం ఎంతోకొంత పనులు జరుగుతున్నది హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టులోనే. పుంగనూరు నియోజకవర్గంలోని రెండు రిజర్వాయర్లతోపాటు కుప్పం బ్రాంచ్‌ కాలువ (కేబీసీ) పరిధిలోనే చేపడుతున్నారు. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి సంస్థ ఈ పనులు చేస్తుండటంతో వారికి మాత్రం త్వరగా బిల్లులు వస్తున్నాయని గుత్తేదారు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెండింగ్‌ బిల్లులు ప్రభుత్వం త్వరగా మంజూరు చేస్తే అటు చెరువులు ఇటు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని