సీ25 క్రయోజనిక్‌ దశలో కీలక మార్పులు

ఇస్రో తాజాగా ప్రయోగించిన ఎల్‌వీఎం-3 వాహకనౌక ఆరోది కాగా గతంలో పంపిన ఐదింటితో పోల్చితే విభిన్నమైంది.

Updated : 27 Mar 2023 04:32 IST

క్ల్రోరిన్‌ ఉద్గారాలపై అప్రమత్తం
నలుపు స్థానంలో తెలుపురంగు పూత

పాత (నలుపు), కొత్త (తెలుపు) ఎల్‌వీఎం-3 వాహక నౌకలు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఇస్రో తాజాగా ప్రయోగించిన ఎల్‌వీఎం-3 వాహకనౌక ఆరోది కాగా గతంలో పంపిన ఐదింటితో పోల్చితే విభిన్నమైంది. సీ25 క్రయోజనిక్‌ దశలోని ఎగువ మధ్యభాగం (రెండు బూస్టర్లపైనున్న టవర్లు) రంగు బూడిద/నలుపునకు బదులుగా ఈసారి తెలుపు వాడారు. దీనికి పలు కారణాలు లేకపోలేదు. వాహన వ్యవస్థలపై నిరంతరం కృషి చేస్తున్న తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ) శాస్త్రవేత్తలు రంగు మార్పు వెనుక పర్యావరణ అనుకూల ప్రక్రియలు, మెరుగైన ఇన్సులేషన్‌ లక్షణాలు, తేలికపాటి పదార్థాల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. సీ25 దశలో క్రయోజనిక్‌ ఇంజిన్‌, ఇంధన ట్యాంకులు ఉండగా ఇవి టన్నుల్లో ఘనీభవించిన ఇంధనాన్ని కలిగి ఉంటాయి.లిక్విడ్‌ హైడ్రోజన్‌ -253 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద, లిక్విడ్‌ ఆక్సిజన్‌ -195 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద నిల్వ చేసినందున క్రయోజనిక్‌ దశ ఇంజినీరింగ్‌ వ్యవస్థ అనేక సవాళ్లను కలిగి ఉంటుంది. ఈ క్రయోజనిక్‌ ద్రవాలను నిల్వ చేయడానికి, అత్యంత శీతల ఉష్ణోగ్రతలను నిర్వహించడానికి, ఇంధన ట్యాంకులు, ఇతర నిర్మాణాలకు ప్రత్యేక బహుళ పొరలతో ఇన్సులేషన్‌ అవసరం. ఎల్‌వీఎం-3 వాహకనౌక మొదటి ఐదు ప్రయోగాల కోసం బూడిద/నలుపు ఇన్సులేషన్‌ ఉపయోగించగా ఇప్పుడు తెలుపు రంగులోకి మార్చారు. మునుపటి ఇన్సులేషన్‌ పదార్థం హైడ్రో క్లోరోకార్బన్‌ (హెచ్‌సీఎఫ్‌సీ)పై ఆధారపడింది. దీని పర్యావరణ సమస్యల కారణంగా హైడ్రోఫ్లోరో-ఓలెఫైన్‌ వంటి రసాయనాల ఆధారంగా హరిత ప్రత్యామ్నాయాలకు మారారు. హెచ్‌సీఎఫ్‌సీలు క్లోరిన్‌ను కలిగి ఉండటం, ఇది ఓజోన్‌ పొరను క్షీణింపజేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున ప్రపంచ వ్యాప్తంగా అసురక్షితమైనదిగా పరిగణించారు. ఇలా అనేక పరిమితులు ఉండటంతో యాంటీ స్టాటిక్‌ పూత (స్థిర విద్యుత్‌ను నిర్మించడాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన) తెలుపు రంగుతో భర్తీ చేశారు. నలుపు వంటి ముదురు రంగులు చాలా వేడిని ఆకర్షిస్తాయి. క్రయోజనిక్‌ ఇంధనాల ఉష్ణోగ్రతపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి పూర్తిగా నిర్మితమైన రాకెట్‌ ప్రయోగ వేదిక వద్ద చాలారోజులపాటు సూర్యరశ్మి ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.


షార్‌లో సందడి

రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షిస్తున్న సందర్శకులు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: షార్‌లో ఆదివారం సందడి నెలకొంది. ఎల్‌వీఎం-3 రాకెట్‌ ప్రయోగ వీక్షణకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. విద్యార్థులకు, సందర్శకులకు రాకెట్‌ ప్రయోగాల గురించి షార్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ రామస్వామి వెంకట్రామన్‌, డీడీ సెంథిల్‌ కుమార్‌ వివరించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి 10,664 మంది రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. షార్‌తోపాటు సందర్శకుల గ్యాలరీలో పోలీసులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి. అటకానితిప్ప వద్ద ప్రత్యేక చెక్‌పోస్టు పెట్టి వాహనాలు తనిఖీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని