logo

సన్నగా మోసం

అధికారం అండతో ఎంతటి మోసాన్నయినా దర్జాగా చేయవచ్చని నిరూపిస్తున్నారు కొందరు అక్రమార్కులు.

Published : 27 Mar 2023 03:25 IST

కుప్పం నుంచి అక్రమ వ్యాపారం

కుప్పంలోని ఓ రైస్‌మిల్లు వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం లారీ(పాత చిత్రం)

అధికారం అండతో ఎంతటి మోసాన్నయినా దర్జాగా చేయవచ్చని నిరూపిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసే రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారాన్ని అధికార పార్టీ ముసుగు వేసుకున్న కొందరు వ్యాపారస్థులు ఆదాయ వనరుగా మలుచుకున్నారు. జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో రేషన్‌ బియ్యం అక్రమం యథేచ్ఛగా సాగుతోందన్న విషయం బహిరంగ రహస్యంగా మారిపోయింది.

న్యూస్‌టుడే, కుప్పం: జిల్లాలో కొనుగోలు చేసే రేషన్‌ బ్యియంతోపాటు తమిళనాడు రేషన్‌ బియ్యాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. గతంలో పేదల బియ్యం కన్నడ రాష్ట్ర పరిధి బంగారుపేటకు చేరేది. ప్రస్తుతం కుప్పం సమీపంలోని ఓ రైస్‌ మిల్లులో రేషన్‌ బియ్యం పాలిష్‌ తతంగం మూడేళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ వ్యాపారి తన రైస్‌ మిల్లులోనే పాలిష్‌ చేస్తూ పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఇటీవల కుప్పం పురపాలిక పరిధిలో రైస్‌ మిల్లులో సన్నబియ్యంగా మలచిన దాదాపు రూ.10 లక్షల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

మోసపోతున్న వినియోగదారులు

కొందరు వ్యాపారస్థులు పాలిష్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని వివిధ బ్రాండెడ్‌ సంచుల్లోకి నింపి వినియోగదారుల్ని మోసగిస్తున్నారని జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఆరోపణలు జోరందుకున్నాయి. కొన్నేళ్లుగా కుప్పం మిల్లులో పాలిష్‌ బియ్యాన్ని 25 కిలోల బస్తాలుగా మలచి.. స్థానికంగానూ వ్యాపారస్థుల ద్వారా వినియోగారులకు అంటగడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకూ వందలాది టన్నుల పాలిష్‌ బియ్యాన్ని దొడ్డిదారిన ఎగుమతి చేసినట్లు భావిస్తున్నారు. అక్రమార్కుల పుణ్యమాని బహిరంగ విపణిలో నికార్సైన సన్నబియ్యం ఏదో? తెలుసుకోలేక మోసపోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని రేషన్‌ బియ్యం అక్రమాలను అరికట్టాలని జనం కోరుతున్నారు.

రైస్‌ మిల్లులో పాలిష్‌ చేసిన    రేషన్‌ బియ్యం బస్తాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని