logo

ఆరు వరుసలు.. ‘ఆగని ప్రమాదాలు’

జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ జరిగినా ప్రమాదాలు తగ్గడం లేదు. బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది.

Updated : 27 Mar 2023 04:37 IST

పెరిగిన హాట్‌, బ్లాక్‌ స్పాట్లు
నాలుగేళ్లు..  1,748 మంది మృతి

న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ జరిగినా ప్రమాదాలు తగ్గడం లేదు. బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. నగరాలు.. గ్రామాలకు అనుసంధానంగా ఉన్న హాట్‌స్పాట్ల వద్ద ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది. అక్కడ అండర్‌, ఫ్ల్లైఓవర్‌ వంతెనలు లేకపోవడం.. ఆ కూడళ్లలో అపసవ్య దిశగా రాకపోకలు జరుగుతుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు, రవాణా శాఖ గుర్తించింది. రెండేళ్లలో జిల్లాలో 48 ప్రమాదాలు జరగ్గా.. 12 మంది మృత్యువాత పడ్డారు.


హత్యా ఘటనల కన్నా రోడ్డు ప్రమాదాల ద్వారానే ఎక్కువ మంది మరణిస్తున్నారు. మనిషి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తించండి. ఇతర శాఖల  సహకారంతో ప్రమాదాల కట్టడికి కృషి చేయండి.

అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులకు ఇచ్చిన ఆదేశాలు.


15 బ్లాక్‌ స్పాట్లు

జిల్లాల పునర్విభజనతో తిరుపతి జిల్లాలో బ్లాక్‌స్పాట్ల సంఖ్య పెరిగింది. ఏడాదిలో మూడు ప్రమాదాలు జరిగే 15 ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా తేల్చారు. జాతీయ రహదారి- 16లోని హోలీ క్రాస్‌ సర్కిల్‌, కోటపోలూరు క్రాస్‌ రోడ్డు, చిల్లకూరు బైపాస్‌ సర్కిల్‌, బీవీ పాళెం చెక్‌పోస్టు, ఆదిశంకర కాలేజ్‌ సెంటర్‌, ఎన్‌హెచ్‌- 71 రహదారిలోని లింగంనాయుడు పల్లె క్రాస్‌ రోడ్డు, ఏఎం పుత్తూరు శివం కల్యాణ మండపం కూడలి, శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌ ఎదురు సర్కిల్‌, మేర్లపాక పద్మావతి హోటల్‌ సర్కిల్‌ బ్లాక్‌స్పాట్‌గా గుర్తించారు. ఎన్‌హెచ్‌- చంద్రగిరి మండలంలోని అగరాల సర్కిల్‌తోపాటు మన్నూరు పోలూరు క్రాస్‌ రోడ్డు, హౌసింగ్‌ బోర్డు కాలనీ సర్కిల్‌, భాకరాపేట ఘాట్‌ కల్యాణిడ్యాం- గంగమ్మ గుడి సర్కిల్‌, తొట్టంబేడు మండలం శ్రీకాళహస్తి- నాయుడుపేట మార్గంలోని కూడలిని బ్లాక్‌ స్పాట్లుగా తేల్చారు.

ఆగిన అప్రమత్తత చర్యలు

కునుకు తీయడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. వేకువజామున 3 నుంచి 5 గంటల లోపు వాహనదారులను అప్రమత్తం చేసే కార్యక్రమం గతంలో జరిగేది. జాతీయ రహదారుల్లో వెళుతున్న వాహనాలను పోలీసులు ఆపి డ్రైవరును దింపి.. వారితో మాట్లాడి ముఖం కడుక్కోమని అప్రమత్తం చేసి పంపేవారు. దూరం నుంచి విశ్రాంతి లేకుండా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తమయ్యేవారు. ప్రస్తుతం ఈ తరహా చర్యలు చేపట్టడం లేదు.


9 హాట్‌ స్పాట్లు

గాజులమండ్యం సర్కిల్‌ నుంచి రామానుపల్లి కూడలి వరకు ఉన్న 9 ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఎన్‌హెచ్‌- 716లోని రామానుజపల్లి చెక్‌పోస్టుతోపాటు ఎన్‌హెచ్‌ 205లోని ఆర్‌సీపురం జంక్షన్‌, అవిలాల హరిజనవాడ సర్కిల్‌, ఓటేరు క్రాస్‌, తనపల్లి క్రాస్‌, దామినీడు వాటర్‌ ట్యాంకు కూడలి, తూకివాకం విలేజ్‌ సర్కిల్‌, గాజులమండ్యం కూడలి, తూకివాకం ఆర్‌ఓబీలను హాట్‌స్పాట్లుగా తేల్చారు. తిరుపతి నుంచి దక్షిణం వైపు ఉన్న గ్రామాలకు వెళ్లే జాతీయ రహదారి కూడళ్లు నిత్యం రద్దీ కారణంగా ప్రమాద నిలయాలుగా మారాయి. దాతలు అందజేసిన సైన్‌బోర్డులు, బారికేడ్లు కొన్నిచోట్లే ఉన్నాయి.ఎవరు ఎటువైపు వస్తారో తెలియని పరిస్థితి.


కూడళ్లలో వంతెనలు అవసరం

ప్రమాదకర కూడళ్ల వద్ద అండర్‌, ఫ్లైౖఓవర్‌ వంతెనల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. సి.మల్లవరం కూడలి వద్ద ఫ్ల్లైఓవర్‌ బ్రిడ్జి, రామానుజపల్లి, ఆర్‌సీపురం, తాజ్‌ సర్కిల్‌, తిరుచానూరు క్రాస్‌, గూడూరు పట్టణం వద్ద అండర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. గాజులమండ్యం సర్కిల్‌ నుంచి రామానుజపల్లి కూడలి వరకు సర్వీసు రోడ్డు విస్తరణకు జిల్లా కమిటీలో చర్చ జరిగింది. తూకివాకం వద్ద ఉన్న ఫ్ల్లైఓవర్‌ వంతెన రెండో లైను ఏర్పాటు చేయాలని కోరాం.

కె.సీతారామిరెడ్డి, జిల్లా రవాణాధికారి, తిరుపతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు