logo

చెరువు.. చెర

తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూములు అధిక ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు వాలిపోతున్నారు.

Published : 27 Mar 2023 03:25 IST

రూ.మూడు  కోట్ల విలువైన భూముల ఆక్రమణ

కబ్జా చేసిన భూమిలో నిర్మాణాలు

తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూములు అధిక ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు వాలిపోతున్నారు. ప్రభుత్వ భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదవాడు మూడు సెంట్ల భూమని ఆక్రమించుకుని గుడిసె నిర్మిస్తే చాలు పోలీసు బలగాలు, జేసీబీలతో వచ్చి నేలమట్టం చేసే రెవెన్యూ అధికారులు... కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా.. కనీసం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు ముఖద్వారం సమీపంలో మల్లగుంట చెరువును కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడకపోవడం గమనార్హం.

న్యూస్‌టుడే, తిరుపతి(నగరం): తిరుచానూరు ముఖద్వారంలో సర్వేనం.265/3లో గతంలో మల్లంగుంట పేరుతో చెరువు ఉండేది. కాలక్రమేణా పూర్తిగా ఎండిపోవడంతో చుట్టు పక్కల నివాసం ఉండే పేదలు ఇళ్లు నిర్మించుకుంటూ వచ్చారు. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. ఐదు ఎకరాలకు పైగా ఖాళీ స్థలం మిగిలినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి అప్పట్లో భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు.  తిరుచానూరు బస్టాండ్‌ ఏర్పాటు చేసేందుకు చెరువును కూడా పరిశీలించారు. కొన్ని రోజుల పాటు ఇక్కడ బస్టాండ్‌ నిర్మించేందుకు చేసిన ప్రతిపాదనలు చివరకు మధ్యలోనే నిలిచిపోయాయి. దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మల్లంగుంట చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుచానూరు సమీప పంచాయతీలకు చెందిన అధికార పార్టీ నేతలు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి దాదాపు రెండు ఎకరాల్లో యంత్రాంగం సహకారంతో కొద్దికొద్దిగా నిర్మాణలు చేపడుతున్నారు. దాదాపు రూ.మూడు కోట్ల విలువైన స్థలంలో నిర్మాణలు జరుగుతున్నా కనీసం రెవెన్యూ యంత్రాంగం అడ్డుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు పత్రాలతో భూములు ఆక్రమిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా స్థానికులు కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ వెంటనే అధికారులు కబ్జాదారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు అందించి వారి చేత బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు స్పందించి చెరువు స్థలం ఆక్రమణకు గురికాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు

మల్లంగుంట చెరువు ఆక్రమించుకున్నట్లు తమకు ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. చెరువు భూములు కబ్జాచేయడం చట్టరీత్యా నేరం. రెవెన్యూ సిబ్బందిని పంపించి వివరాలు తెలుసుకుంటా.

లోకేశ్వరి, తహసీల్దారు, తిరుపతి గ్రామీణ మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని