logo

నిధులు అందక.. పనులు సాగక

పురపాలక సంఘంగా ఏర్పాటైంది.. ఎన్నికలు పూర్తై.. అధికార పార్టీ ఛైర్మన్‌ గిరి సాధించుకుంది.. ఎన్నికల సమయంలో పురపాలక సంఘ పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

Published : 27 Mar 2023 03:25 IST

కుప్పం పురపాలికలో కానరాని అభివృద్ధి
సమస్యలతో ప్రజల అవస్థలు

చీగలపల్లెలో మురుగునీటి కాలువ నిర్మాణానికి గుంతలు తీసి వదిలేసిన దృశ్యం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘంగా ఏర్పాటైంది.. ఎన్నికలు పూర్తై.. అధికార పార్టీ ఛైర్మన్‌ గిరి సాధించుకుంది.. ఎన్నికల సమయంలో పురపాలక సంఘ పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మురుగునీటి కాలువల నిర్మాణానికి వార్డుల పరిధిలో నెలల క్రితం గుంతలు తవ్వారు.. వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించేందుకు పనులు చేపట్టి అర్ధాంతరంగా వదిలేశారు. ఇలా రూ.66 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభమై నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు. ఏ వార్డు చూసినా పురోగతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

రాధాక్రిష్ణారోడ్డులో మురుగుకాలువపై నిలిచిన వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు

పాలకవర్గం, అధికారుల మనస్పర్థలతో

పట్టణం రామచంద్రారోడ్డు నుంచి ప్రధాన రహదారి నేతాజీ రోడ్డుకు అనుసంధానంగా రూ.2 కోట్ల వ్యయంతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించేందుకు పురపాలక సంఘ పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మనస్పర్థలు రావడంతో నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. ఇలా ఓ వైపు జరిగిన అభివృద్ధికి నిధులు మంజూరు కాక.. కొత్త పనులు ముందుకు సాగక నిధుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వార్డుల్లో ఇదీ పరిస్థితి..

కుప్పం పురపాలక సంఘ పరిధిలోని 25 వార్డుల్లో తొమ్మిది వార్డులు మినహా మిగిలిన 16 వార్డుల్లో మురుగునీటి కాలువల నిర్మాణం ప్రారంభించారు. వార్డుల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందక పోవడంతో మిగిలిన వార్డుల్లో మురుగునీటి కాలువల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నారు. దీంతో నెలల క్రితం తవ్విన గుంతలపైనే భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్‌ కాలనీ, చీగలపల్లె, షికారీ కాలనీ, జయప్రకాష్‌ రోడ్డు, మోడల్‌ కాలనీ తదితర ప్రాంతాలలో పనులు అర్ధాంతరంగా ఆగి దర్శనమిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం మురుగునీటి కాలువ నిర్మాణానికి తీసిన గుంతలపై బండలు పరుచుకొని రాకపోకలు సాగించాల్సి పరిస్థితి దాపురించిందని పురపాలక ప్రజలు వాపోతున్నారు. చీగలపల్లెలోని వీధుల్లో మురుగునీటి కాలువ గుంత నిండి ప్రమాదకరంగా మారింది.

బిల్లుల కోసం ప్రతిపాదనలు

వార్డుల పరిధిలో ఇప్పటి వరకు రూ.12 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరిగాయి. పలువార్డుల్లో 80 శాతం పనులు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన రూ.12 కోట్ల బిల్లుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పలుచోట్ల కూలీలు లభించకపోవడంతో నిర్మాణాలు నిలిచాయి. వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

రవిరెడ్డి, పురపాలక కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని